Begin typing your search above and press return to search.

పౌరసత్వ బిల్లు పై ఎందుకంత ఆగ్రహావేశాలు? ఏముంది అందులో?

By:  Tupaki Desk   |   5 Dec 2019 4:25 AM GMT
పౌరసత్వ బిల్లు పై ఎందుకంత ఆగ్రహావేశాలు? ఏముంది అందులో?
X
ఇటీవలకాలంలో దేశ వ్యాప్తంగా చర్చను రేకెత్తించిన అంశాల్లో ఒకటి పౌరసత్వ చట్ట సవరణ బిల్లు. తాజాగా దీనికి కేంద్రమంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. త్వరలోనే పార్లమెంటు కు ముందుకు రానున్న ఈ బిల్లుపై పలు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు దేశ వ్యాప్తం గా జాతీయ పౌర పట్టికను చేపట్టాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ.

అసలు ఎందుకీ బిల్లు?
సింఫుల్ గా చెప్పాలంటే భారతదేశానికి పొరుగుదేశాలైన పాక్.. బంగ్లాదేశ్.. అఫ్ఘానిస్థాన్ దేశాలకు చెందిన హిందు.. సిక్కు.. జైన్.. బౌద్ధ.. పార్శీ.. క్రైస్తవులకు భారతీయ పౌరసత్వం కల్పించటం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే అమల్లో ఉన్న పౌరసత్వ చట్టం ప్రకారం ఇలా వేరే దేశాల నుంచి వచ్చిన వారిని చట్టవ్యతిరేక కాందిశీకులుగా ముద్ర వేస్తారు.

నిర్దేశిత సమయానికి మించి ఉన్న వారందరిని చట్టవిరుద్దమైన అక్రమ వలసదార్లుగా పేర్కొనేవారు. ఈ నేపథ్యంలో 1955లో రూపొందించిన నిబంధనల్ని మార్చాలన్నది మోడీ సర్కారు ఆలోచన. ఇప్పటివరకూ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గా ఉన్న వారికి భారత పౌరసత్వాన్ని ఇస్తారు. వాస్తవానికి ఈ సవరణ బిల్లు 2016లోనే లోక్ సభ ఆమోదించింది. కాకుంటే రాజ్యసభలో ఇది ఆమోదం పొందటానికి ముందే పదహారో లోక్ సభ రద్దు కావటంతో ఈ బిల్లు మురిగిపోయింది.

కీలకమైన ప్రశ్నలేమంటే?
ఈ బిల్లు కారణంగా దేశంలోని ముస్లింలకు ముప్పు వాటిల్లుతుందన్న వాదనను పలువురు వినిపిస్తున్నారు. దీనికి తగ్గట్లే వారు బలమైన వాదనను వినిపిస్తున్నారు. బిల్లులో ముస్లింలను ఎందుకు చేర్చలేదు? నేపాల్.. శ్రీలంక నుంచి వచ్చే మైనార్టీలను ఎందుకు విస్మరించారు? భారత రాజ్యాంగం ప్రకారం దేశ పౌరులను మత ప్రాతిపదికన వేరు చేయకూడదని చెబుతున్న వేళ.. పౌరసత్వ నిర్ధరణకు మాత్రం ఇప్పుడీ బిల్లు తీసుకురావటం ఏమిటి? అన్న ప్రశ్నల్ని సంధిస్తున్నారు.

ఈశాన్య రాష్ట్రాల అభ్యంతరం ఇదే..
ఈ బిల్లు విషయంలో దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. ఈశాన్య రాష్ట్రాల నుంచే వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ఎందుకిలా? అంటే.. బయట దేశాల నుంచి వచ్చే వారిని తమ రాష్ట్రాల్లో పౌరసత్వం కల్పిస్తే అక్కడ పుట్టి పెరిగిన తెగల మనుడగ ప్రశ్నార్థకమవుతుందన్నది వారి భయంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఒక ప్రతిపాదనను తెర మీదకు తెచ్చింది. ఈ బిల్లు చట్టం అయ్యాక.. దీని ద్వారా పౌరసత్వం పొందిన వారికి ఈశాన్య రాష్ట్రాల్లో స్థానికత కల్పించబోమని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

బయట దేశాల నుంచి వచ్చినోళ్లు ఎందరు? వారెవరు?
ఇంత రచ్చ జరుగుతుంది కదా? వేరే దేశాల నుంచి వచ్చిన వారు లక్షల్లో ఉన్నారా? అంటే అది కూడా లేదు. కేంద్రం లెక్కల ప్రకారం మూడు దేశాల నుంచి ఇప్పటివరకూ వచ్చింది 31,313 మంది మాత్రమే. వీరిలో హిందువులు 25,447 మంది కాగా.. సిక్కులు 5,807 మంది. క్రైస్తవులు 56 మంది.. బౌద్దులు.. పార్శీలు ఇద్దరేసి చొప్పున ఉన్నట్లు అంచనా.

పార్లమెంటు ఉభయ సభల్లో ఈ బిల్లు మాటేమిటి?
లోక్ సభలో బీజేపీ కి తిరుగులేని మెజార్టీ ఉండటంతో ఈ బిల్లుకు ఎలాంటి ఇబ్బంది లేదు. రాజ్యసభలోనే ఇబ్బంది అంతా. అభ్యంతరాలు ఎక్కువైన పక్షంలో సెలెక్ట్ కమిటీకి పంపి క్షుణ్ణంగా చర్చించాలని సభ్యులు డిమాండ్ చేయొచ్చు. ఈ బిల్లును కాంగ్రెస్.. టీఎంసీ.. డీఎంకే.. సమాజ్ వాదీ.. ఆర్జేడీ.. వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. వచ్చే వారం ఈ బిల్లు మీద రాజ్యసభలో చర్చ జరిగే వేళలో బీజేపీ ఎంపీలు గైర్హాజరు కాకుండా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా బిల్లును గట్టెక్కించాలని ప్రభుత్వం భావిస్తోంది.