Begin typing your search above and press return to search.

రష్యా యుద్ధ ట్యాంకర్ల పై ఆ సింబల్ ఎందుకు? దేనికి సంకేతం?

By:  Tupaki Desk   |   27 Feb 2022 4:40 AM GMT
రష్యా యుద్ధ ట్యాంకర్ల పై ఆ సింబల్ ఎందుకు? దేనికి సంకేతం?
X
ప్రపంచ వ్యాప్తంగా అందరి నోట ఒకటే మాట వినిపిస్తోంది. అదే రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం. ఏ ఇద్దరి మధ్య చూసినా ఇదే చర్చ. అగ్ర రాజ్య అధినేత దగ్గర నుంచి అరేబియన్ దేశాల వరకు ఈ యుద్ధానికి సంబంధించిన మాటలే వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించిన నాటి నుంచి ఒకటే చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే అత్యంత శక్తివంతమైన దేశంగా ఉన్న రష్యా సరిహద్దుల్లో ఉండే ఉక్రెయిన్ దండెత్తింది. ఎలాగైన ఆక్రమించుకోవాలని చూస్తోంది.

ఇందులో భాగంగా ఆ దేశంలో ప్రవేశించాయి రష్యా సేనలు. వివిధ రకాల యుద్ధ విన్యాసాలతో, ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. సరిహద్దులో ఉండి ఖండాంతర క్షిపణులను కూడా ప్రయోగిస్తున్నాయి. ఇదిలా ఉంటే రష్యా సేనలకు సంబంధించిన ఓ గుర్తు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అదే ఇంగ్లీష్ అక్షరం జెడ్. ఇంతకీ ఈ జెడ్ కు ఉన్న విశిష్ఠత ఏంటి? ఆ అక్షరానికి ఏమైనా ప్రత్యేకత ఉందా? లేక యుద్ధ వ్యూహాల్లో అదొక భాగమా అని ఇలా చర్చ జరుగుతుంది. ఇంతకీ ఈ జెడ్ అనే అక్షరం ఏంటి?

ర‌ష్యాకు చెందిన చాలా యుద్ధ విమానాల్లో, యుద్ధ ట్యాంకర్లపైనా, సాయుధ వాహనాల పైనా ఓ అక్షరం కనిపిస్తుంది. ఈ జెడ్ అనే గుర్తుకు చాలా చరిత్ర ఉందని దాని గురించి తెలిసిన వారు అంటున్నారు. ఇంతకీ అది ఏంటి అంటే? ప్రతి దేశం కూడా యుద్ధ రంగానికి సంబంధించిన కొంత మంది నిపుణులను ఓ గ్రూప్ గా ఏర్పాటు చేస్తుంది. వారికి అనేక విద్యల్లో శిక్షణ ఇప్పిస్తుంది. అలా పూర్తి స్థాయిలో అన్ని రంగాల్లో ప్రావిణ్యం సంపాదించిన వారిని ప్రత్యేక దళం గా ఏర్పాటు చేస్తుంది.

ఇలా రష్యా ఏర్పాటు చేసిన దళమే..జాతీయ భద్రతా దళం. దీనిని రోజ్గా వార్డియా ట్రూప్స్ అని కూడా అంటారు. ఈ రోజ్గా వార్డియా ట్రూప్స్ అనేది వాస్తవానికి కేవలం అధ్యక్షుడు పుతిన్ చుట్టు పక్కల మాత్రమే తిరుగుతుండేవి. ఆయన్ను సంరక్షించడం వాటి పని. పుతిన్ కు సంబంధించిన అనేక భద్రతా వ్యవహారాలను ఈ రోజ్గా వార్డియా ట్రూప్స్ నే చూసుకుంటారు.

ఎలాంటి ప్రదేశంలో అయిన చొచ్చుకుపోవడం వీటి ప్రత్యేకత. ఎలాంటి ఏ ప్ర‌దేశంలోనైనా వీరి అప్పగించిన విధులు పూర్తి చేస్తారు. అంత ప్రావిణ్యం, నైపుణ్యం వీరి సొంతం. అయితే వీరు ఉపయోగించే సాయుధ వాహనాలకు మాత్రమే ఈ విధమైన జెడ్ అనే గుర్తు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్ ఆక్రమణ కొరకు రష్యా అలాంటి దళాన్ని రంగంలోకి దింపిందని ఆశ్యర్య పోతున్నారు. దీనిపై ప్రపంచం దేశాలు కూడా ఆందోళన చెందుతున్నాయి.

ఇదిలా ఉంటే ఈ గుర్తుకు సంబంధించిన మరో వాదనను కూడా తెరపైకి తీసుకుని వచ్చారు కొందరు నిపుణులు. అది ఏమిటంటే.. యుద్ధం జరిగేటప్పుడు రెండు దేశాల బలగాలు ఎదురెదురు పడి యుద్ధం చేస్తాయి. కొన్ని సార్లు త్రిముఖ వ్యూహం పాటిస్తే మూడు వైపుల నుంచి దాడి అనేది జరుగుతుంది. ఇలాంటి సమయాల్లో ఎదురుగా ఉన్నది మన సాయుధ వాహనం అని సైనికులు తెలుసుకునేందుకు ఓ గుర్తుగా దీనిని రష్యా ఉపయోగిస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే ఉక్రెయిన్ ఆక్రమణ కోసం రష్యా వేసిన ఎత్తుగడ త్రిముఖ వ్యూహమే.

అందుకే రష్యా ఓ గుర్తుగా జెడ్ ను ఎంచుకున్నదని తెలిసిన వారు అంటున్నారు. అయితే విచిత్రంగా బెలారస్‌లో ఉండే కొన్ని సాయుధ వాహనాలపై ఓ అనే గుర్తు కూడా కనిపిస్తుందని చెప్తున్నారు. ఏది ఏమైనా పుతిన్ వ్యూహంతో ఉక్రెయిన్ బాంబుల దాడులతో దద్దరిల్లింది. ఎంతో మంది ప్రాణాలను చేతిలో పట్టుకుని బంకర్ల కింద తలదాచుకుంటున్నారు. మరి కొందరు అయితే ఏకంగా దేశం విడిచి పెట్టి వెళ్లి పోతున్నారు.