Begin typing your search above and press return to search.

ఆ ఎంపీ సౌండ్ చేయడం లేదేంటి?

By:  Tupaki Desk   |   9 April 2021 5:13 PM IST
ఆ ఎంపీ సౌండ్ చేయడం లేదేంటి?
X
ఒక్క ఓటమి ఆ ఎంపీ మౌనాన్ని ఆశ్రయించేలా చేసిందా? విదేశాల్లో మంచిగా స్థిరపడ్డ కూతురుని తీసుకొచ్చి మరీ మున్సిపల్ ఎన్నికల్లో నిలిపాడు. తొడగొట్టి.. టీడీపీ నేతలతో గొడవలు పెట్టుకొని మరీ విజయవాడ మేయర్ గా కూతురును నిలబెట్టాడు. అయితే అధికార వైసీపీ ధాటికి ఎంపీ కూతురు ఓడిపోయింది. విజయవాడ మేయర్ ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఈ దెబ్బకు విజయవాడ ఎంపీ కేశినేని నాని తలెత్తుకోలేకుండా అయ్యాడా? అందుకే సైలెంట్ అయ్యాడా? అంటే ఔననే అంటున్నాయి రాజకీయవర్గాలు.

టీడీపీ ఫైర్ బ్రాండ్ ఎంపీగా కేశినేని నానికి పేరుంది. మొన్నటి విజయవాడ మున్సిపల్ ఎన్నికల్లో ఆయన చేసిన రచ్చను ఎవరూ మర్చిపోలేదు. రాజకీయంగా హీటెక్కించేలా ఆయన మాటలు ట్వీట్లు ఉండేవి. విజయవాడలో టికెట్ల విషయంలో టీడీపీ నేతలతో భారీ వివాదాలు అయినా తన కుమార్తెనే మేయర్ అభ్యర్థి అని.. తనకు నచ్చిన వారికే టికెట్లను కేటాయించాడు. అసమ్మతి చెలరేగి చంద్రబాబు వరకు పంచాయతీ వెళ్లింది.

చివరకు చంద్రబాబు సర్దిచెప్పి నేతలను ఒక్కతాటిపైకి తెచ్చి మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేయించారు. కానీ పైకి నవ్వుకున్న నేతలు లోపల మాత్రం ఫైట్ చేసుకున్నారు. ఫలితం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం. నాని టీడీపీకి కీలకమైన ఓటు బ్యాంకుగా ఉన్న బీసీ వర్గాల నాయకులను పట్టించుకోకపోవడం ఆయన ఓటమికి కారణమైంది. నేనే గెలిపించుకుంటానని ఎంపీ హోదాలో అందరినీ దూరం పెట్టి ఓటమి కొనితెచ్చుకున్నాడని అంటారు.

తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించాలని కేశినేనాని నానిని కోరినా నాని మాత్రం రావడం లేదు. స్పందించడం లేదు. నాని అందరినీ ఎదురించి విజయవాడలో పోటీ చేసి ఓడిపోయాక ఇక మొహం చూపించలేకపోతున్నారని.. అందుకే బెంగళూరుకు మకాం మార్చారని అంటున్నారు. దూకుడుకు పర్యాయపదంగా ఉండే నానిని ఒక్క ఓటమి సైలైన్స్ చేసిందా? ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారన్నది తెలియాల్సి ఉంది.