Begin typing your search above and press return to search.

ఎవరీ లచ్చిరెడ్డి.. సీఎం సారు ఎందుకు ఫోన్ చేశారు?

By:  Tupaki Desk   |   17 Aug 2019 7:24 AM GMT
ఎవరీ లచ్చిరెడ్డి.. సీఎం సారు ఎందుకు ఫోన్ చేశారు?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మామూలోరు కాదు. ఆయన తీరు భిన్నంగా ఉంటుంది. చేతిలో సమస్త అధికార యంత్రాంగం ఉన్నప్పటికీ.. రోజువారీగా వారు రిపోర్టులు ఇస్తున్నప్పటికీ.. తనదైన చానల్ లో సమాచారాన్ని సేకరిస్తుంటారు. అధికారుల నివేదికకు.. గ్రౌండ్ లెవల్లో రియాలీటికి మధ్య వ్యత్యాసం ఎంతన్న విషయాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తుంటారు. తాను ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు ఎంతమేరకు చేరుతున్నాయన్న విషయాన్ని తనకు తానే క్రాస్ చేసుకునే ప్రయత్నం చేసిన సీఎం కేసీఆర్ తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ.. గ్రౌండ్ లెవల్ రియాలిటీని తెలుసుకునేందుకు కేసీఆర్ అనుసరించే తీరు కాస్త విచిత్రంగా ఉంటుంది. తాజా ఉదంతం ఆ కోవకు చెందిందే. సిరిసిల్ల జిల్లా బొయినపల్లి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కొనుకటి లచ్చిరెడ్డి. పొలంలో పని చేసుకుంటున్న ఆయనకు శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మీతో మాట్లాడతారని చెప్పినంతనే సదరు లచ్చిరెడ్డి ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఆయన దానిలో నుంచి తేరుకోకముందే.. కేసీఆర్ గొంతు వినిపించటంతో పాటు.. ఏం లచ్చిరెడ్డి బాగున్నావా? అని అడిగిన ఆయన మాటకు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఏం చేస్తున్నావన్న ప్రశ్నకు పొలంలో నాట్లు వేసుకుంటున్నట్లు చెప్పారు. వెంటనే వరదకాలువ వద్దకు వెళ్లి నాతో ఫోన్లో మాట్లాడు.. మధ్య మానేరుకు వస్తున్న వరద నీటితో రైతులకు ఉపయోగం ఉందా? లేదా? అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రే నేరుగా తనతో మాట్లాడటంతో అవాక్కు అయిన లచ్చిరెడ్డి పరుగు పరుగున సీఎం కేసీఆర్ చెప్పిన ప్రాంతానికి వెళ్లారు. వరద కాలువ ద్వారా వస్తున్న నీటితో రైతులకు ఉపయోగం ఉందా? అని ప్రశ్నించగా.. రైతులంతా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. వరదకాలువ వరప్రదాయినిగా మారిందన్న ఆయన.. ఈ కాలువ ద్వారా వస్తున్న నీటితోనే అందరూ నాట్లు వేసుకుంటున్నట్లు చెప్పారు.

తన పక్కనే ఉన్న ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ తోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. గురువారం 1600 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉందని.. శుక్రవారం నాటికి 7వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారన్నారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంటే.. నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించిన సమస్యల్ని చెప్పగా.. వెంటనే జిల్లా కలెక్టర్ ను కలవాల్సిందిగా సూచించారు. దీంతో.. వారంతా జిల్లా కలెక్టర్ ను కలవటం.. సమస్యను త్వరగా పరిష్కారిస్తానన్న మాటను ఇవ్వటం జరిగింది. సీఎం స్వయంగా చూస్తున్న ఇష్యూ అంటే ఆ మాత్రం రెస్పాన్స్ లేకుండా ఉంటుందా?