Begin typing your search above and press return to search.

పాక్ జిందాబాద్ అనేటోళ్లతో చర్చలు జరపాలా?

By:  Tupaki Desk   |   7 Sept 2016 10:54 AM IST
పాక్ జిందాబాద్ అనేటోళ్లతో చర్చలు జరపాలా?
X
ఈ ప్రశ్న ఇంకెవరైనా వేస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. ఈ ప్రశ్నను కశ్మీరీలు వేస్తే..? గడిచిన కొన్ని వారాలుగా అట్టుడికిపోతున్న కశ్మీర్ లో పరిస్థితిని చక్కదిద్దేందుకు వీలుగా ఢిల్లీ నుంచి అన్నీ పార్టీలకు చెందిన అఖిలపక్షం ఒకటి కశ్మీర్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కశ్మీరీ నాయకులతో చర్చలు జరిపి.. ఇప్పుడున్న పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తీవ్రంగా అవమానించేలా వ్యవహరిస్తున్నారు. వేర్పాటు నేతలుగా ఉన్న గిలానీ లాంటి పలువురు కశ్మీరీ నాయకులు అఖిలపక్షం నేతల్ని ఇళ్లల్లోకి కూడా ఆహ్వానించకుండా వెనక్కి పంపేయటం తెలిసిందే.

ఇలాంటి అవమానాలు ఎదురవుతున్నా.. కశ్మీర్ లో పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు చేపట్టాల్సిన కార్యక్రమంపై పలు వర్గాలతో చర్చలు జరుపుతోంది కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ నేతృత్వంలో వెళ్లిన అఖిలపక్షం. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక బృందం రాజ్ నాథ్ ను కలిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాకిస్థాన్ జిందాబాద్ అనే వారితో చర్చలు జరపాల్సిన అవసరం ఏమిటంటూ సూటిగా ప్రశ్నించటం కనిపించింది.

గిలానీ ఇంటికి అఖిలఫక్ష నేతలు వెళ్లిన సందర్భంగా అక్కడే ఉన్న ఆయన.. అఖిలపక్ష నేతల్ని ఇంట్లోకి పిలిచి మాట్లాడేందుకు అంగీకరించకపోవటం.. అక్కడే ఉన్న ఆయన మద్దతుదారులు పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన నేపథ్యంపై ఎంపీల బృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి సమయంలోనే రాజ్ నాథ్ బృందాన్ని కలిసిన కొందరు వేర్పాటు వాదుల వైఖరిని ప్రశ్నిస్తూ.. దాయాది దేశాన్ని జిందాబాద్ అంటూ నినాదాలు చేసే వారితో చర్చలు జరపాల్సిన అవసరం ఏమిటంటూ వేసిన ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. కశ్మీర్ సమస్య పరిష్కారంలో ఎవరికి ఎలాంటి పాత్ర ఇవ్వాలన్న అంశంపై తాజా ఉదంతం ఒక స్పష్టత ఇచ్చిందన్న వాదన వినిపిస్తోంది. నిజమే.. పాక్ కు జై కొట్టే వారితో చర్చలు జరపాల్సిన అవసరం ఏముంది? వారేం మాట్లాడతారో తెలిసిందే కదా? అలాంటి వారిని పట్టించుకోకుండా ఉండటం.. చట్టబద్ధ చర్యలు తీసుకోకుంటే ఈ వ్యవహారం మరింత ముదిరిపోవటం ఖాయం.