Begin typing your search above and press return to search.

న్యాయవాదులను ప్రభుత్వం ఎందుకు ఆదుకోవాలి?

By:  Tupaki Desk   |   8 July 2021 1:30 AM GMT
న్యాయవాదులను ప్రభుత్వం ఎందుకు ఆదుకోవాలి?
X
కరోనా కల్లోలంలో అందరూ నానా ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగ, ఉపాధి కోల్పోయారు. తినడానికి కానకష్టం అయిన వారు ఉన్నారు. ప్రభుత్వాలు పెద్దగా సాయం చేసింది లేదు. అయితే అందరినీ వదిలేసి న్యాయవాదులను మాత్రమే ఎందుకు ఆదుకోవాలి? ఇదే ప్రశ్న తెలంగాణ హైకోర్టు వేసింది.

సహజంగా న్యాయవాదులు, న్యాయమూర్తులు అంతే ఒకే జట్టుగా ఉంటారు. ఆ మధ్య ఓ లాయర్ దంపతుల హత్య జరిగితే సుమోటగా తీసుకొని మరీ విచారించి భద్రత చర్యలు చేపట్టాలని.. బాధ్యులను శిక్షించాలని ఆదేశించారు. అయితే తాజాగా హైకోర్టు తీర్పుతో మాత్రం న్యాయవాదులు షాక్ తిన్నారు.

తెలంగాణ హైకోర్టు నిలదీతతో తమకు అనుకూలంగా తీర్పువస్తుందని ఆశపడ్డ న్యాయవాదులకు నిరాశ ఎదురైంది. తాజాగా కోవిడ్ కల్లోలంలో ఇబ్బందులు పడ్డ న్యాయవాదులు, క్లర్కులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలంటూ దాఖలైన పిటీషన్ పై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. ‘అసలు న్యాయవాదులను ప్రభుత్వం ఎందుకు ఆదుకోవాలని’ హైకోర్టు ప్రశ్నించింది. న్యాయవాదులను ఆదుకునేందుకు బార్ కౌన్సిల్ , న్యాయవాద సంఘాలు ఉన్నాయి కదా అని హైకోర్టు తేల్చిచెప్పింది.

న్యాయవాదులు ప్రభుత్వంపై ఆధారపడవద్దని.. సొంత నిధిని ఏర్పాటు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. సీనియర్ న్యాయవాదుల సహకారంతో నిధిని ఏర్పాటు చేసుకొని కోవిడ్ తో ఇబ్బందులు పడ్డవారిని ఆదుకోవాలని హితవు పలికింది. వారం రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని బార్ కౌన్సిల్ ను హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టు తీర్పుతో న్యాయవాదులు షాక్ అయిన పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ లో న్యాయవాదులకు జగన్ ప్రభుత్వం ఆర్థికసాయం చేసింది. ఏపీలో మాదిరిగానే తెలంగాణలో కూడా ప్రభుత్వం నుంచి అందుతుందని ఆశించి హైకోర్టును ఆశ్రయించగా, ప్రతి కూల తీర్పు రావడంతో భంగపడ్డారు.