Begin typing your search above and press return to search.

ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ఆమె..రాహుల్‌కు నిరాశేనా?

By:  Tupaki Desk   |   5 Aug 2018 5:31 PM GMT
ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ఆమె..రాహుల్‌కు నిరాశేనా?
X
రాబోయే ఎన్నిక‌లపై గంపెడాశ‌లు పెట్టుకోవ‌డమే కాకుండా...ప్ర‌ధానమంత్రి ప‌ద‌వి గురించి కూడా ఇప్ప‌టినుంచే క‌ల‌లు కంటున్న కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం జీర్ణించుకోలేని వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. ప్ర‌తిప‌క్షాల కూట‌మిలోని కీల‌క పార్టీ నాయ‌కుడు సంచ‌ల‌న ప్ర‌తిపాద‌న పెట్టారు. ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని నిర్ణయిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత దేవెగౌడ తెలిపారు. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా పనిచేశారని, మళ్లీ ఇప్పుడు ఓ మహిళ ప్రధాని అయితే తప్పేంటని ప్రశ్నించారు. ఆ మహిళ మమతాగానీ, మాయవతిగానీ ఎవరైనాగానీ ఓ మహిళ ప్రధాని కావడంలో తప్పులేదని చెప్పారు. ముందుగా ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోటీ చేయాలని, ప్రధాని అభ్యర్థిని ఎన్నికల తర్వాత నిర్ణయిద్దామని కాంగ్రెస్‌ ఆలోచిస్తున్న నేపథ్యంలో దేవేగౌడ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

పీటీఐ వార్తా సంస్థకు దేవేగౌడ ఇచ్చిన‌ ఇంటర్వ్యూలో దేవెగౌడ మాట్లాడుతూ 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పాటు కావాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ‘బీజేపీని అధికార పీఠం నుంచి దించడంలో, ప్రతిపక్షాలను కూడగట్టడంలో కాంగ్రెస్‌ కీలక పాత్ర పోషించనుంది. అలాగే మూడో కూటమి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ విషయంలో మమతాబెనర్జీ కీలకపాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలి జాతీయ పౌర రిజిస్టర్‌ నుంచి 40 లక్షల మంది అసోం పౌరుల పేర్లను తొలిగిస్తున్నట్లు ముసాయిదాలో పేర్కొనడాన్ని మమతాబెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేగాక ఈ ముసాయిదాకు వ్యతిరేకంగా వివిధ పార్టీల మద్దతునూ కూడగట్టుతున్నారు. ఇదే అదునుగా 2019 ఎన్నికల్లో ప్రతిపక్షాల కూటమి దిశగానూ ఆమె చర్యలు చేపడుతున్నారు’ అని తెలిపారు. ప్రస్తుతం దేశంలో భయానక వాతావరణం నెలకొన్నదని, ముఖ్యంగా దళితులు, మైనారిటీల్లో అభద్రతాభావం నెలకొందని చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, బీహార్‌లలో ఈ పరిస్థితులు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో జేడీఎస్‌, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేస్తాయని పేర్కొన్నారు.