Begin typing your search above and press return to search.

ఒలింపిక్స్ లో రష్యా ఎందుకు కనిపించట్లేదు.. ఈ ‘ఆర్వోసీ’ అంటే ఏంటి?

By:  Tupaki Desk   |   27 July 2021 4:13 AM GMT
ఒలింపిక్స్ లో రష్యా ఎందుకు కనిపించట్లేదు.. ఈ ‘ఆర్వోసీ’ అంటే ఏంటి?
X
నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఒలింపిక్స్ ప్రస్తుతం జపాన్ రాజధాని టోక్యో మహానగరంలో జరుగుతున్నాయి. దీని కోసం ఆ చిన్ని దేశం భారీగా ఏర్పాట్లు చేసింది. కరోనా నేపథ్యంలో ఈ విశ్వ క్రీడలు కళ తప్పాయి. అయినప్పటికీ పోటీలు ఆరంభమైన నాటి నుంచి అందరి చూపు క్రీడల మీదనే ఫోకస్ అయ్యింది. ఒలింపిక్స్ అన్నంతనే దేశాల మధ్య పతకాల వేట కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది.

పతకాల్ని భారీగా సొంతం చేసుకునే మూడు దేశాల్లో రష్యా ఒకటి. చైనా.. రష్యా.. అమెరికాలు మూడు.. పతకాల్ని సొంతం చేసుకోవటానికి తెగ ప్రయత్నిస్తుంటాయి. తమ అధిక్యతను ప్రదర్శించటానికి తపిస్తుంటాయి. అలాంటిది రష్యా పేరు కానీ.. ఆ దేశ జాతీయ పతాకం కానీ తాజా ఒలింపిక్స్ లోకనిపించని పరిస్థితి. ఎందుకిలా? అంటే.. రష్యా మీద ఉన్న నిషేధమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఎందుకిలా అంటే? డోపింగ్ టెస్టుల్లో రష్యా అవకతవకలకు పాల్పడినట్లుగా 2014 నుంచి ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ జరిపిన వాడా (వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) 2015లో రష్యా యాంటీ డోపింగ్ ల్యాబ్ ను మూసేసింది.

తప్పుడు పనులకు పాల్పడినందుకు ఈ చర్యను తీసుకుంది. అంతేకాదు.. వంద మంది రష్యా క్రీడాకారుల్ని క్రీడల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. డోపింగ్ నకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చిన విషయాన్ని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు.. 2019 డిసెంబరులో రష్యాపై నాలుగేళ్లు నిషేధాన్ని విధిస్తున్నట్లుగా ప్రకటించిన వైనం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై రష్యా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ లోనే కాదు ఫిఫా వరల్డ్ కప్ 2022తో సహా అంతర్జాతీయ క్రీడల్లో రష్యా పాల్గొనే అవకాశం లేకుండా పోయింది.

ఇప్పటికైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పటికీ.. ఆయుధ పరంగా..సాంకేతికంగా శక్తివంతమైన తమ లాంటి దేశంపై బ్యాన్ విధిస్తే చూస్తూ ఊరుకుంటుందా? అందుకే.. ఇతర మార్గాల్ని అన్వేషించింది. కొందరు చేసిన తప్పులకు అందరికి శిక్ష విధించాలా? అంటూ వాదనను తెర మీదకు తీసుకొచ్చి..నిషేధం కారణంగా కఠోర శిక్షణ తీసుకుంటున్న తమ అథ్లెట్ల పరిస్థితేమిటంటూ వాడా విధించిన నిషేధంపై అప్పీలు చేసుకునే అవకాశాన్ని వినియోగించుకుంది రష్యా. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన కాస్ (కోర్టు ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్) వాడా విధించిన నాలుగేళ్ల నిషేధాన్ని రెండేళ్లకు తగ్గించింది.

అంటే.. 2022 డిసెంబరు వరకు రష్యా మీద నిషేధం ఉంటుంది. ఈ కారణంగా టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. డోపింగ్ వ్యవహారంతో సంబంధం లేని క్రీడాకారులు ఒలింపిక్స్ లో పాల్గొనటానికి వీలుగా.. కొన్ని షరతుల్ని విధించింది ఒలింపిక్స్. రష్యా దేశం పేరున కానీ.. రష్యా జాతీయ పతాకాన్ని ప్రదర్శించి కానీ ఆటల్లో పాల్గొనకుండా రష్యన్ ఒలింపిక్స్ కమిటీ (ఆర్ ఓసీ) పేరుతో టోక్యో ఒలింపిక్స్ లో ప్రాతినిధ్యం వహించటానికి వీలుగా నిర్ణయం తీసుకున్నారు. దీనిపై వాడా అసంతృప్తి వ్యక్తం చేసింది.

అయినప్పటికీ దాన్ని పట్టించుకోకుండా కాస్ ఇచ్చిన తీర్పుతో ఆర్ వోసీ పేరుతో రష్యా అధ్లెట్లు టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొంటున్నారు. ఈ కారణంగానే ఈ క్రీడా సంరంభం ప్రారంభం సందర్భంగా రష్యన్ అథ్లెట్లు ఆర్ వోసీ పేరుతో మార్చ్ ప్రదర్శించారు. అయితే.. రష్యాకు ఇలాంటి బ్యాన్లు కొత్తేం కాదని.. ఆ దేశ చరిత్రను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఇప్పటివరకు పలుమార్లు పలు సందర్భాల్లో ఆ దేశంపై బ్యాన్ విధించటం కనిపిస్తుంది. మరి.. తాజా ఒలింపిక్స్ లో ఆరో వోసీ పేరు మీద పాల్గొంటున్న అథ్లెట్లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి.