Begin typing your search above and press return to search.

ఢిల్లీ అల్లర్లపై ప్రశ్నించవా పవన్?

By:  Tupaki Desk   |   27 Feb 2020 12:57 PM IST
ఢిల్లీ అల్లర్లపై ప్రశ్నించవా పవన్?
X
హైదరాబాద్ లోని ఓ ప్రాంతంలో అల్లర్లు జరుతుంటాయి....ఇతర రాష్ట్రాలకు చెందిన స్థానికేతరులను తరిమికొట్టాలని ఓ యువ రాజకీయ నేత ఇచ్చిన పిలుపుతో అల్లరి మూకలు రెచ్చిపోయి విధ్వంసం సృష్టిస్తుంటాయి....స్థానికేతరుల దుకాణాలు ధ్వసం చేస్తూ....వారిపై దాడి చేస్తుంటారు....ఇదంతా చూసి చలించిపోయిన మానవత్వం...సామాజిక బాధ్యత ఉన్న ఓ చానెల్ రిపోర్టర్ గా నటించిన పవన్ కల్యాణ్....ఆ యవనేతకు హితబోధ చేస్తాడు.....సదరు యువనేత తండ్రికి చికిత్స చేసే నర్సు మలయాళీ అని.....తెలుగు తల్లి....మరాఠా తల్లి....గుజరాతీ తల్లి...ఉండదని...మనమందరం భరత మాత ముద్దుబిడ్డలం అంటూ జాతీయవాదాన్ని నూరిపోస్తాడు....ఈ సీన్ లో పవన్ చెప్పే డైలాగ్స్ కు థియేటర్లో విజిల్స్...క్లాప్స్...విపరీతంగా వచ్చాయి. ఇక, ప్రస్తుతం ఢిల్లీలో ఇరు వర్గాల మధ్య జరుగుతున్న అల్లర్లు కూడా దాదాపు ఆ సినిమాలోని సీన్ తరహాలో ఉన్నాయి. అయితే, ఆ వీరావేశంతో డైలాగ్స్ చెప్పిన నాటి హీరో పవన్ కల్యాణ్....నేడు జనసేనానిగా మారిన తర్వాత నోరు మెదపడం లేదు. సాధారణం గా తాను కులమతాలకతీతంగా రాజకీయాలు చేసేందుకు వచ్చానని చెప్పే పవన్....ఢిల్లీ అల్లర్ల పై కనీసం ఒక్క ట్వీట్ చేయలేదు. బీజేపీతో పొత్తు నేపథ్యంలోనే ఢిల్లీ అల్లర్లపై పవన్ మౌనంగా ఉన్నారని విమర్శలు వస్తున్నాయి.


ఢిల్లీ అల్లర్లపై ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, సినీ తారలు, సామాజిక కార్యకర్తలు స్పందించారు. బీజేపీ మద్దతుదారుడంటూ ముద్ర పడిన రజనీకాంత్ కూడా కేంద్రంపై డైరెక్ట్ గా కామెంట్స్ చేశారు. ఇక, కమల్ వంటి రైట్ వింగ్ నేతలు...కేంద్రాన్ని తూర్పార బడుతున్నారు. అయితే, మామూలుగానే పవన్ కు ఆవేశం ఎక్కువ. ఇక ఢిల్లీ అల్లర్ల తరహా ఘటనలు జరిగితే పవన్ రక్తం మరిగిపోవాలి. ప్రెస్ మీట్ పెట్టో....కనీసం ట్వీట్ చేసో తన ఆవేశాన్ని వెళ్లగక్కే పవన్....మన్నుతిన్న పాములెక్క మిన్నకున్నాడు. బీజేపీతో పొత్తు నేపథ్యంలో పవన్ ....తన సిద్ధాంతాలకు, నైతిక విలువలకు తిలోదకాలిచ్చేశాడని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఉనికి లేదు....ఎన్డీఏలో కలువు బ్రదర్....రాజధాని నగరంలో వీధి వీధి నాదే బ్రదర్.....గంగలో మునకేసి `కాషాయం`కట్టేయ్ బ్రదర్ ....అంటూ పవన్ కమలనాథులకు దాసోహమయ్యారని సెటైర్లు పేలుతున్నాయి. పొత్తు ధర్మాన్ని పాటించే క్రమంలో పవన్....తన అస్థిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాడని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఢిల్లీ కూడా భారత్ లో అంతర్భాగమే పవన్ అంటూ విమర్శిస్తున్నారు.

అయితే, గతంలోనూ ప్రధాని మోడీని పవన్ డైరెక్ట్ గా ఏనాడూ టార్గెట్ చేయలేదు. ఏదో అనాలి కాబట్టి ఏ అమిత్ షానో....మరో అనామక నేతనో విమర్శించేవాడు. సాధారణంగా పేరు పెట్టి మరీ విమర్శించే పవన్....ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో షా పేరు ప్రస్తావించే సాహసం అసలు చేయడు. అందులోనూ....సీఏఏ వల్ల ఇబ్బందేమీ లేదంటూ....బీజేపీ తరఫున పవన్ వకాల్తా కూడా పుచ్చుకున్నాడు. మొన్నటి వరకు హోదా పాట పాడిన పవన్....ఇప్పుడు ఆ పాట పల్లవి కూడా మరచిపోయాడు. వైసీపీతో బీజేపీ దోస్తీ తర్వాత డీలా పడ్డ పవన్....ఇటు పొత్తు తెంచుకోలేక....అటు పొత్తు ధర్మం నెరవేర్చలేక సతమతవుతున్నారట. ఇంకా గట్టిగా మాట్లాడితే....పవన్....మరో నాలుగేళ్ల పాటు సినిమా షూటింగ్ ల పేరుతో సుప్త చేతనావస్థలోకి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యారు. ఈ నాలుగేళ్లు ఏదో మొక్కుబడిగా పార్టీ నిర్వహించాలని అనుకుంటున్నారట. వరుస సినిమాలతో నాలుగు రాళ్లు వెనకేసుకొని...బలంగా 2024 ఎన్నికల మ్యాచ్ ఆడేందుకు రెడీ అవుతున్నారట.