Begin typing your search above and press return to search.

క్రూడాయిల్ కారుచౌక కానుందా?

By:  Tupaki Desk   |   18 Jan 2016 9:14 AM GMT
క్రూడాయిల్ కారుచౌక కానుందా?
X
ప్రపంచంలో మరే వస్తువు దొరకనంత చౌకగా క్రూడ్ ఆయిల్ లభిస్తోంది. ఒకప్పుడు మంట పుట్టించి.. పలుదేశాల ఆర్థిక వ్యవస్థల్ని పుట్టి ముంచిన క్రూడాయిల్ ధర పతనం ఇప్పుడు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే దశాబ్దం నాటి రికార్డుల్ని బ్రేక్ చేసిన క్రూడ్ ఆయిల్ ధర తాజాగా మరింత తగ్గిపోయింది. బ్యారెల్ క్రూడాయిల్ ధర 30 డాలర్ల దిగువకు పడిపోవటం తెలిసిందే.

తాజాగా అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఈ ధర ఇప్పుడు 28 డాలర్ల దిగువకు చేరుకుంది. తాజాగా క్రూడాయిల్ ధర బ్యారెల్ 27.67కు పడిపోయింది. 2003 తర్వాత ఇంత భారీగా ధర పడిపోయింది ఇప్పుడే. ఇంత భారీగా ధర పతనం కావటానికి కారణం లేకపోలేదు. ఇరాన్ పై అమెరికా విధించిన ఆంక్షల్ని ఎత్తివేస్తూ ఒబామా సర్కారు నిర్ణయం తీసుకోవటం తాజా పతనానికి కారణంగా చెబుతున్నారు.

ఇరాన్ మీద అమెరికా ఆంక్షలకు.. క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవటానికి లింకేమిటన్న సందేహం అక్కర్లేదు. చమురు భారీగా ఉత్పత్తి చేసే ఇరాన్ పై ఉన్నఆంక్షల కారణంగా భారీగా ఆ దేశం ఎగుమతులు చేయలేకపోతోంది. తాజాగా ఆంక్షలు ఎత్తేసిన నేపథ్యలో ఇరాన్ పలు దేశాలకు క్రూడాయిల్ ను ఎగుమతి చేసే అవకాశం దక్కుతుంది. దీంతో.. ఇప్పటికే పెరిగిపోయిన క్రూడాయిల్ ఉత్పత్తి మరింత పెరిగిపోవటం ఖాయం. అదే తాజా ధర పతనానికి కారణంగా చెప్పొచ్చు. 2011 ప్రాంతంలో ఇరాన్ నుంచి రోజుకు 10లక్షల బ్యారళ్ల వరకూ ముడి చమురు సరఫరా అవుతూ ఉండేది.

ఇలాంటి సమయంలోనే అమెరికా ఆంక్షలు విధించింది. తాజాగా ఆంక్షలు ఎత్తేసిన నేపథ్యంలోఇంత భారీ ముడిచమురు వెలికి తీత మళ్లీ షురూ కానుంది. మార్కెట్లోకి ఇంత భారీగా ముడిచమురు ఉత్పత్తిబయటకు వస్తే.. పోటీతో ధర పడిపోవటం ఖాయం. ఈ పరిణామాల్ని సూచిస్తూ తాజాగా ధర పడిపోయింది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం.. అన్ని అనుకున్నట్లు జరిగితే ముడిచమురు దర బ్యారెల్ 20 డాలర్ల దిగువకు పడిపోయే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.