Begin typing your search above and press return to search.

పార్లమెంట్ కు అంబేడ్కర్ పేరు సరే.. ప్రగతిభవన్ కు చాకలి ఐలమ్మ పేరు ఎందుకు పెట్టనట్లు?

By:  Tupaki Desk   |   14 Sep 2022 4:19 AM GMT
పార్లమెంట్ కు అంబేడ్కర్ పేరు సరే.. ప్రగతిభవన్ కు చాకలి ఐలమ్మ పేరు ఎందుకు పెట్టనట్లు?
X
నీతులు చెప్పటానికి మించిన తేలికైన పని ఇంకేం ఉంటుంది. అందునా..తాము వ్యతిరేకించే రాజకీయ ప్రత్యర్థిని ఉద్దేశించి చెప్పే మాటలకు అంతుపొంతు అన్నదే ఉండదు. తమ ఎజెండాలో భాగంగా పెద్ద పెద్ద మాటలే చెప్పేస్తుంటారు. ఇప్పుడు అలాంటి మాటలే చెప్పుకొచ్చారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు.. రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలన్న దానిపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేయటమే కాదు.. తీర్మానం కూడా చేశారు.

అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చింది.. ఆయన చూపిన బాటలోనే నడుస్తున్నామని.. అంబేడ్కర్ లక్ష్యం సమానత్వమని.. ఆయన భాషా అధిపత్యం.. ప్రాంతీయ అధిపత్యంతో పాటు అన్ని రకాల అధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. ఆయన్ను సమగ్రంగా సమాజాన్ని అర్థం చేసుకున్న వారెవరూ లేదరన్నారు. తాను రాసిన రాజ్యాంగం దుర్వినియోగమైతే.. దాన్ని తానే ముందుగా తగలబెడతానని అంబేడ్కర్ అన్నారు.

దేవుడు కోసం గుడి కడితే.. దెయ్యాలు ముందే వచ్చి కూర్చుంటే గుడిని ధ్వంసం చేయక తప్పదన్న ఆయన మాటల్ని చెప్పుకొచ్చారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక అయిన పార్లమెంట్ కు ఆయన పేరు పెట్టాల్సిన అవసరం ఉందని.. అంతకు మించిన వ్యక్తి మరెవరూ లేదరన్నారు.

అందుకే అంబేడ్కర్ పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇదంతా బాగానే ఉంది. మరి.. తెలంగాణ ఉద్యమంలోనూ.. పోరాటంలోనూ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని తీసుకొని పోరాటం చేసి.. తెలంగాణను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

మరి.. ప్రజల డబ్బులతో కట్టిన ప్రగతిభవన్ కు చాకలి ఐలమ్మ పేరుకు మించిన అర్హత ఇంకెవరికైనా ఉంటుందా? మరి..ప్రగతి భవన్ కు ''చాకలి ఐలమ్మ ప్రగతిభవన్'' అని ఎందుకు పెట్టనట్లు?అంతదాకా ఎందుకు తెలంగాణలో కొత్తగా నిర్మిస్తున్న కొత్త సెక్రటేరియట్ కు పోరాట యోధుడు కొమురం భీం సచివాలయం అని పెట్టే ఆలోచనను ఇదే కేసీఆర్ సర్కారు ప్రకటించలేదు? ఎదుటోడికి నీతులు చెప్పేదానికి ముందే.. తాను కూడా అదే పని చేయాలన్న చిన్న విషయాన్ని ఎలా మిస్ అయినట్లు? కేంద్రాన్ని అలా చేయండి.. ఇలా చేయండని సలహాలు.. సూచనలు చేయటం తప్పేం కాదు.

కానీ.. దానికి ముందు.. మనమేం చేశామన్నది కూడా పాయింటే కదా? ఆ విషయంలో వెలెత్తి చూపేలా ప్రభుత్వం తీరు ఉందన్న మాట వినిపిస్తోంది. మరి.. ప్రగతి భవన్ కు చాకలి ఐలమ్మ పేరును కేసీఆర్ ఎప్పుడు పెట్టేస్తున్నారన్న ప్రశ్నకు కేటీఆర్ అండ్ కో సమాధానం ఇస్తారంటారా?




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.