Begin typing your search above and press return to search.

మెరుపులు సరే.. మరకలు చెప్పరేం మోడీ?

By:  Tupaki Desk   |   27 Nov 2019 10:29 AM IST
మెరుపులు సరే.. మరకలు చెప్పరేం మోడీ?
X
ఊహించని ఎదురుదెబ్బ తగిలినప్పుడు? దిమ్మ తిరిగే షాక్ ఎదురైనప్పుడు? సాధారణంగా ఏం చేస్తాం. ఒక అడుగు వెనక్కి వేస్తాం. వాతావరణం అనువుగా లేదని తగ్గుతాం. కాస్త.. ఆగి తామేంటో చూపిద్దామనుకోవటం అందరూ చేసే పని. అలా చేస్తే ఆయన మోడీ ఎందుకవుతారు? తాజాగా తన ప్రత్యేకత ఏమిటన్నది చేతల్లో చూపించారు ప్రధాని. మహారాష్ట్ర ఎపిసోడ్ మహా మలుపులు తిరిగి.. అవమానకర రీతిలో తమ పార్టీకి చెందిన ప్రభుత్వానికి నాలుగు రోజులకే నూకలు చెల్లిన వేళ.. ప్రధాని చెప్పుకున్న గొప్పలు ఆసక్తికరంగా మారాయి.

తాజాగా రిపబ్లిక్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన రిపబ్లిక్ సమ్మిట్ లో ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పాలనలో సాధించిన విజయాల మీద ఏకరువు పెట్టారు. తమ జీవితకాలంలో చూడగలమా? అనుకున్న చాలా అంశాల్లో తాము వాటిని చేసి చూపించినట్లుగా చెప్పారు.

ట్రిపుల్ తలాక్.. ఆర్టికల్ 370 నిర్వీర్యం.. జీఎస్టీ.. తక్కువ వ్యవధిలో ఏడు కోట్ల టాయిలెట్లు లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసినట్లు చెప్పుకున్నారు. తనకు అలవాటైన కుటుంబ రాజకీయాల ప్రస్తావన చేశారు. కొన్ని కుటుంబాల రాజకీయ స్వార్థంతోనే ఆర్టికల్ 370 శాశ్వితమన్న అభిప్రాయాన్ని కలిగించినట్లు పేర్కొన్నారు.

ఇన్ని గొప్పలు చెప్పుకున్న మోడీ.. తన కారణంగానే మహారాష్ట్రలో తాజా రాజకీయ పరిస్థితి చోటు చేసుకున్న విషయాన్ని.. బలం లేకున్నా గోవా.. హర్యానాలో ప్రభుత్వాల్ని ఏర్పాటు చేయటం.. పవర్ కోసం కర్ణాటకలో తాము పన్నిన వ్యూహాల గురించి చెబితే బాగుండేది.రాజకీయాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చేసేది ఒక్కటే అన్న విషయాన్ని చేసి చూపించిన మోడీ.. తన ముందున్న పాలకులకు భిన్నమని మాత్రం చెప్పలేకపోయారు.

రాజకీయ కోణంలోనే కాదు.. అవినీతి మరక అన్నది లేని మోడీ హయాంలో ఆర్థికంగా దేశం ఎందుకు పరుగులు తీయలేకపోతుందో చెబితే బాగుండేది. అంతా బాగున్నప్పుడు ఆర్థిక మందగమనం ఎందుకొచ్చినట్లు అన్న సందేహానికి సమాధానం చెప్పాల్సింది. ఏది ఏమైనా..
మిగిలిన వారికి మోడీకి ఓ పెద్ద తేడా ఉంది. దిమ్మతిరిగేలా భారీ ఎదురుదెబ్బ తగిలిన రోజునే తమ పాలన గురించి గొప్పలు చెప్పుకునే ధైర్యం ఆయనకు మాత్రమే సాధ్యమని చెప్పక తప్పదు.