Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ తో బిర్లా భేటీ!.. ఏపీలో పెట్టుబడుల‌పై చ‌ర్చ‌!

By:  Tupaki Desk   |   28 May 2019 5:37 PM IST
జ‌గ‌న్ తో బిర్లా భేటీ!.. ఏపీలో పెట్టుబడుల‌పై చ‌ర్చ‌!
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్... క‌నీసం రాజ‌ధాని కూడా లేకుండా 13 జిల్లాల‌తో పెద్ద‌గా ఆదాయ వ‌న‌రులు లేకుండా ఏర్పాటైన రాష్ట్రం. ఐదేళ్ల ప్ర‌స్థానంలో టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు జ‌బ్బ‌లు చ‌రుచుకుంటూ తిరిగ‌డం త‌ప్పించి రాష్ట్రానికి పెద్ద‌గా ఒర‌గ‌బెట్టిందేమీ లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. అయితే ఆర్థిక ఇబ్బందుల్లోని రాష్ట్రానికి పెట్టుబ‌డులు రాబ‌ట్ట‌డ‌మే ల‌క్ష్య‌మంటూ ప‌లు దేశాలు, ప‌లు రాష్ట్రాల‌ను లెక్క‌కు మించి తిర‌గ‌డం త‌ప్పించి పెద్ద‌గా పెట్టుబ‌డులు రాబ‌ట్ట‌లేక‌పోయారు. వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాలు సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సులు నిర్వ‌హించినా కూడా పెద్దగా ఫ‌లితం రాబ‌ట్ట‌లేక‌పోయారు.

అయితే ఇటీవ‌లే జ‌రిగిన ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు పాల‌న‌ను తిర‌స్క‌రించిన ఏపీ జ‌నం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీకి ఘ‌న విజ‌యం క‌ట్ట‌బెట్టారు. ఈ నెల 30న జ‌గ‌న్ ఏపీకి నూత‌న సీఎంగా ప్ర‌మాణం చేయ‌నున్నారు. ఇంకా సీఎంగా ప్ర‌మాణం చేయ‌కుండానే... జ‌గ‌న్ ను వెతుక్కుంటూ ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌లు ఏపీకి క్యూ క‌డుతున్నారు. మొన్న‌టికి మొన్న ఢిల్లీ వెళ్లిన సంద‌ర్భంగా జ‌గ‌న్ తో భేటీ కోసం దేశీయ పారిశ్రామిక రంగంలో దిగ్గ‌జ కంపెనీగా ఉన్న బిర్లా కంపెనీ అధినేత కుమార మంగ‌ళం బిర్లా... నేరుగా ఏపీ భవ‌న్ కు వ‌చ్చారు. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ రాజ్ దీప్ స‌ర్దేశాయ్ ని వెంటేసుకుని మ‌రీ వ‌చ్చిన బిర్లా... జ‌గ‌న్ తో చాలా సేపు భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా ఏపీలో ఉన్న అపార అవ‌కాశాలు, ఏఏ జిల్లాల్లో ఎలాంటి అవ‌కాశాలున్నాయి అన్న విష‌యంపై చ‌ర్చించిన‌ట్టుగా స‌మాచారం. కొత్త పెట్టుబ‌డుల‌కు సంబంధించి బిర్లా నుంచి ఇటీవలే ఓ ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. గుజ‌రాత్ లో ద‌శ‌ల‌వారీగా రూ.15 వేల కోట్ల మేర పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్లుగా ఆ ప్ర‌క‌ట‌న‌లో ఆయ‌న వెల్ల‌డించారు. జౌళి, ర‌సాయ‌న రంగాల్లోనే ఈ పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్లుగానూ బిర్లా ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ నుంచి ఆహ్వానం లేకుండానే... జ‌గ‌న్ ఎక్క‌డున్నారోనంటూ వెతక్కుంటూ మ‌రీ ఏపీ భ‌వ‌న్ కు వ‌చ్చిన బిర్లా.... జగ‌న్ తో భేటీ కావ‌డంపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టే దిశ‌గానే సాగుతున్న బిర్లా... అందులో భాగంగానే జ‌గ‌న్ తో భేటీ అయిన‌ట్టుగా కూడా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.