Begin typing your search above and press return to search.

కుమార్ లింగంపల్లి సర్పంచ్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తి ఎందుకయ్యాడు

By:  Tupaki Desk   |   12 Nov 2019 1:30 AM GMT
కుమార్ లింగంపల్లి సర్పంచ్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తి ఎందుకయ్యాడు
X
ఒక చిన్న గ్రామానికి సర్పంచ్ అయిన వ్యక్తి ఏకంగా వార్తల్లో వ్యక్తిగా ఎలా మారాడు? అన్నది చూస్తే.. అతగాడి వ్యక్తిత్వం.. అతడి పని తీరే కారణంగా చెప్పాలి. ఎన్నికల వేళ నోటికి వచ్చినన్ని హామీలు ఇచ్చేయటం.. తీరా చేతికి పవర్ వచ్చిన తర్వాత అన్ని విషయాల్ని తూచ్ అన్నట్లుగా మర్చిపోవటం చాలామంది చేస్తుంటారు. దీనికి భిన్నంగా కుమార్ లింగంపల్లి సర్పంచ్.

నారాయణపేట జిల్లా పరిధిలో ఉన్న ఈ గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే.. ఊళ్లో ఆహార భద్రత కార్డు ఉన్న వారికిచ్చే బియ్యాన్ని తాను ఉచితంగా పంపిణీ చేస్తానని పేర్కొన్నారు. దీనికి తగ్గట్లే ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం సర్పంచ్ పదవిని చేపట్టిన అరవింద్ రెడ్డి.. గడిచిన ఎనిమిది నెలలుగా ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు.

ఆహారభద్రత కార్డులో ఉన్నన్నికిలోల చొప్పున ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తూ.. ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నారు. ఎన్నికల వేళలో హామీలు ఇవ్వటం కాదు.. పదవిని చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీల్ని అమలు చేయటం ఎంత కీలకమన్న విషయాన్ని ఆయన తన చేతలతో చెప్పేస్తున్నారు. ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తున్న దానికి అయ్యే వ్యయాన్ని అరవింద్ రెడ్డి భరిస్తున్నారు.

సదరు గ్రామ జనాభా 1500 మంది కాగా.. 380 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఒక్కో సభ్యుడికి ఆరు కేజీలు చొప్పున మొత్తంగా నెలకు 98 క్వింటాళ్ల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.దీనికి కాను ప్రతి నెలా రూ.9500 మొత్తాన్ని భరిస్తున్నాడు. హామీ ఇవ్వటం కంటే ఇలా నిలబెట్టుకునేలా నేతలు వ్యవహరిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.