Begin typing your search above and press return to search.

ప్లీనరీ వేళ జయశంకర్ సారుకు నివాళిగా భారీ ప్రకటన ఇవ్వరేం కేసీఆర్?

By:  Tupaki Desk   |   27 April 2022 6:30 AM GMT
ప్లీనరీ వేళ జయశంకర్ సారుకు నివాళిగా భారీ ప్రకటన ఇవ్వరేం కేసీఆర్?
X
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 21 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో.. కలలో కూడా ఊహించలేని రంగును పార్టీ జెండాగా సిద్ధం చేసిన కేసీఆర్.. పార్టీని ప్రకటించటం తెలిసిందే. అయితే..ఆయన ప్రయాణంతో అడుగులు వేసి.. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ కు సంబంధించిన వాదనను అందించిన ఘనత ప్రొఫెసర్ జయశంకర్ సారుదే. ఆయన రూపొందించిన సిద్ధాంతాన్ని అనుసరిస్తూ.. ఆయనకున్న మంచి పేరును తరచూ ప్రస్తావిస్తూ కేసీఆర్ ప్రసంగాలు సాగేవి.

సైద్దాంతిక అంశాల కోసం.. తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసుకోవటం కోసం ఎన్నో నిద్ర లేని రాత్రుల్ని గడిపామని.. వేలాది గంటలు తెలంగాణ గురించి మాట్లాడుకున్నట్లుగా కేసీఆర్ చెబుతుంటారు.

తెలంగాణ సాధనలో కీలకమైన తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంత కర్తగా వ్యవహరించిన జయశంకర్ సారును పార్టీ ప్లీనరీ రోజున యాది చేసుకుంటే నష్టమేముంది? ఈ రోజున తాము అనుభవిస్తున్న అధికారం ఆయన సిద్ధాంత పుణ్యమే కదా? జయశంకర్ సారు లేకుంటే అసలు తెలంగాణ ఉద్యమం భారీగా రూపుదిద్దుకునేదా? అంతా నాదే.. అన్ని నావే అన్నట్లుగా తెలంగాణ సాధనకు సంబంధించి కష్టాలు పడినోళ్లు.. త్యాగాలు చేసినోళ్లను వదిలేసి.. కేవలం నేను.. నా కుటుంబం మాత్రమే అన్నట్లుగా ప్రచారం చేసుకోవటం దేనికి నిదర్శనం?

తెలంగాణను సాధించి ఎనిమిదేళ్లు మాత్రమే అయ్యింది. ఒక పాతికేళ్లో.. యాభై ఏళ్లో గడిస్తే.. పాత విషయాలు కొత్త వారికి తెలిసే అవకాశం లేదు. అలాంటిదేమీ లేని రోజుల్లోనే త్యాగాలు చేసిన వారిని వదిలేసిన వైనాన్ని ఏమనాలి? ఎవరు అవునన్నా.. కాదన్నా తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాల్ని ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

తమ ప్రాణాల్ని పణంగా పెట్టినందుకే తెలంగాణ సాధన సాధ్యమైంది. కేంద్రం మీద పెద్ద ఎత్తున ఒత్తిడికి కారణమైంది. కానీ.. ఈ రోజున పార్టీ ప్లీనరీ జరుపుకునే వేళ.. తాము ఉన్న ఈ స్థానానికి అమరవీరుల త్యాగాలే అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏమైనా.. నడిచి వచ్చిన బాటను మర్చిపోకుండా అదే పనిగా గుర్తు తెచ్చుకుంటే అందరి అభిమానాన్ని.. ఆశీర్వచనాన్ని పొందే వీలుంది. అదేం అక్కర్లేదు.. మాకు ఎవరి అవసరం లేదనుకుంటే ఎవరు మాత్రం ఏం చెప్పగలరు?