Begin typing your search above and press return to search.

రైతన్న సినిమాకు వెళ్లిన ఎర్రబెల్లి.. వెనక్కి పిలిచిన కేసీఆర్

By:  Tupaki Desk   |   1 Nov 2021 2:46 PM GMT
రైతన్న సినిమాకు వెళ్లిన ఎర్రబెల్లి.. వెనక్కి పిలిచిన కేసీఆర్
X
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం 'రైతన్న' సినిమా చూసేందుకు వెళ్లారు. ఆ సినిమా దర్శక నిర్మాత, నటుడు నారాయణమూర్తితో కలిసి హనుమకొండలోని అమృత థియేటర్‌కు వచ్చారు. అయితే సినిమా ప్రారంభం అవుతున్న సమయంతో సీఎం కేసీఆర్ నుంచి మంత్రి ఎర్రబెల్లికి ఫోన్ వచ్చింది. వెంటనే హైదరాబాద్‌కు రావాలని చెప్పడంతో సినిమా చూడకుండానే మంత్రి ఎర్రబెల్లి వెనుదిరిగారు. దీంతో హడావిడిగా ఆయన సినిమా చూడకుండా వచ్చారు. సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎర్రబెల్లి దయాకర్‌రావు మీడియాతో మాట్లాడారు. నారాయణమూర్తితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

నారాయణమూర్తి, తన కుటుంబ స్నేహితుడని తెలిపారు. 'రైతన్న' సినిమా ద్వారా రైతుల సమస్యలను ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడారు. ఈ చిత్రాన్ని అందరూ చూడాలని కోరారు. రైతుల కష్టాలను సినిమా ద్వారా వెలుగులోకి తెచ్చినందుకు ఆయనకు ఎర్రబెల్లి అభినందనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు శాపంగా మారాయని దుయ్యబట్టారు. రైతులను దోచుకోవడం ద్వారా అంబానీలు, అదానీలకు లబ్ధి చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని విమర్శించారు. తమ ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని తెలిపారు. 2018 ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాలు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారాయని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. రేపు రానున్న హుజూరాబాద్ ఉపఎన్నికల ఫలితాలే ఓటర్ల హవా ఎలా ఉందో తెలియజేస్తుందని ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యానించారు.

2021లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను రద్దు చేయాలనే ప్రధాన కథాశంతో రైతన్న సినిమాను నిర్మించారు.రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకూడదని, అన్నం పెట్టే అన్నదాతకి గిట్టుబాటు ధర కావాలని, కేంద్రప్రభుత్వం డా.స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులని అమలు చేయాలనీ, రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రధాన సమస్యలను సినిమాలో చూపించారు.