Begin typing your search above and press return to search.

గంటా ఇంటి వేడుక‌ల్లో జేడీ ఎందుకు?

By:  Tupaki Desk   |   16 Jun 2022 5:34 AM GMT
గంటా ఇంటి వేడుక‌ల్లో జేడీ ఎందుకు?
X
విశాఖ ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గ శాస‌న స‌భ్యులు, మాజీ మంత్రి గంట శ్రీ‌నివాస్ మ‌న‌వ‌డి జ‌న్మ‌దిన వేడుక‌లు ఇటీవ‌ల హైద్రాబాద్లో జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయణ‌తో పాటు కేవీపీ కూడా హాజ‌ర‌య్యారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఎప్ప‌టి నుంచో రాజ‌కీయాల్లో ఉన్న గంటా శ్రీ‌నివాస‌రావు ఇటీవ‌ల కాస్త సైలెంట్ అయిపోయారు.

కొన్ని వేడుక‌ల్లో, ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో మిన‌హా పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. తాజాగా జ‌రిగిన వేడుకల‌కు సినీ ప్ర‌ముఖుల సంద‌డి కూడా బాగానే ఉంది. హీరో శ్రీ‌కాంత్, న‌ట కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్ లాంటి వారు కూడా వ‌చ్చి సందడి చేసి వెళ్లారు. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ పార్టీల‌కతీతంగా అంద‌రితోనూ స‌ఖ్యంగా ఉండే గంటా ఇక‌పై ఎటువంటి ఎత్తుగ‌డ‌లు వేయ‌నున్నారో మ‌రి!

చాలా రోజులకు కేవీపీ రావ‌డ‌మే కాదు..చాలాసేపు ఈ వేడుక‌ల్లో ఉండి వెళ్లారు. పెద్ద‌గా ప్ర‌యివేటు ఫంక్ష‌న్ల‌లో కనిపించ‌ని కేవీపీ, ఇలాంటి రాజ‌కీయ ప్ర‌ముఖుల వేడుక‌లకు మాత్రం హాజ‌రై కాస్త ఎక్కువ సేపే ఉండి వెళ్ల‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మే! ఎప్ప‌టి నుంచో కేవీపీకి, గంటాకు మ‌ధ్య మంచి బంధాలే ఉన్నాయి.

కాంగ్రెస్-లో, తెలుగుదేశంలో, కొంత కాలం ప్ర‌జారాజ్యంలో రాజ‌కీయం న‌డిపిన గంటా మ‌ధ్యలో జ‌న‌సేన‌కు వెళ్లాల‌ని కూడా భావించారు.అయితే ఈ వేడుక‌ల్లో వైసీపీ నాయ‌కులు ఎవ్వ‌రూ కనిపించ‌లేదు. ఆఖరికి శిష్యుడు అవంతి శ్రీ‌నివాస‌రావు కూడా వ‌చ్చిన దాఖ‌లాలేవీ లేవు.

వాస్త‌వానికి వైసీపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీలో చేరిపోయి చ‌క్రం తిప్పాల‌ని ఆయ‌న భావించినా కుద‌ర్లేదు అని ప‌రిశీల‌కులు చెబుతారు. ఆయ‌న రాక‌ను సాయి రెడ్డి అడ్డుకున్నార‌ని అంటుంటారు.

విశాఖ జిల్లా రాజ‌కీయాల‌ను శాసించే శ‌క్తి ఉన్న ఆయ‌న ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గం మారే ప‌నిలో ప‌డ్డారు. గాజువాక నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే ఛాన్స్ ఉంది. అదేవిధంగా తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న స్ధానానికి మేన‌ల్లుడిని బ‌రిలో దింపుతారు అనికూడా తెలుస్తోంది. మ‌హానాడు త‌రువాత చంద్ర‌బాబు ప్రాధాన్యాలు మారిన త‌రుణంలో గంటా రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు కూడా వెంటవెంట‌నే మారిపోతున్నాయి.