Begin typing your search above and press return to search.

జగన్‌ లండన్‌ పర్యటన రద్దు అందుకేనా?

By:  Tupaki Desk   |   18 April 2023 10:00 AM GMT
జగన్‌ లండన్‌ పర్యటన రద్దు అందుకేనా?
X
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ లండన్‌ పర్యటన రద్దయినట్టేనని తెలుస్తోంది. వాస్తవానికి ఏప్రిల్‌ 21 నుంచి వారం రోజులపాటు అంటే 27 వరకు సీఎం జగన్‌ కుటుంబ సమేతంగా లండన్‌ పర్యటనకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. తన సతీమణి భారతి, విదేశాల్లో చదువుతున్న ఇద్దరు కుమార్తెలు హర్షా రెడ్డి, వర్షారెడ్డిలతో జగన్‌ విదేశాల్లో విహార యాత్ర చేయడానికి సిద్ధమయ్యారని ప్రచారం జరిగింది.

అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. తాజాగా జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి మేనమామ, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డిని అరెస్టు చేసింది. వైఎస్‌ అవినాష్‌ రెడ్డిని కూడా నేడో, రేపో అరెస్టు చేయొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జగన్‌ ఏప్రిల్‌ 21 నుంచి చేయాలనుకున్న లండన్‌ పర్యటనను రద్దు చేసుకున్నారని సమాచారం. అయితే దీనిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

కాగా ఏప్రిల్‌ 17న జగన్‌ అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పలలో పర్యటించాల్సి ఉంది. జగనన్న వసతి దీవెన పథకం నిధులను అక్కడ నుంచి జమ చేయడానికి షెడ్యూల్‌ ఖరారైంది. అయితే ఏప్రిల్‌ 16న వైఎస్‌ భాస్కరరెడ్డిని అరెస్టు చేయడంతో అనంతపురం పర్యటనను జగన్‌ రద్దు చేసుకున్నారు. ఈ పర్యటనను ఏప్రిల్‌ 26కు వాయిదా వేశారు.

జగన్‌ విదేశీ యాత్ర షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 26న విదేశాల్లో ఉండాల్సి ఉంది. అయితే ఏప్రిల్‌ 26న అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ విదేశీ పర్యటన రద్దు అయినట్టేనని అనడానికి ఇదే నిదర్శనమంటున్నారు. వివేకా హత్య కేసులో తాజా పరిణామాలే జగన్‌ పర్యటన రద్దుకు కారణమని అంటున్నారు.

మరోవైపు తాజా పరిణామాల నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ వైసీపీ ముఖ్య నేతలతో తాడేపల్లి క్యాంప్‌ ఆఫీసులో సుదీర్ఘ సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ అనుబంధ విభాగాల సమన్వయకర్త, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటివారితో తాజా పరిణామాలపై జగన్‌ వేర్వేరుగా సుదీర్ఘ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.

వైఎస్‌ భాస్కరరెడ్డి అరెస్టు నేపథ్యంలో పార్టీపరంగా అనుసరించాల్సిన వ్యూహం, ప్రతిపక్షాల విమర్శలను ఎలా తిప్పికొట్టాలి? ప్రజల్లోకి ఈ అంశంపై ఎలా వెళ్లాలి? వంటి అంశాలపై వీరితో జగన్‌ చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది.