Begin typing your search above and press return to search.

'శశికళ'కే ఎందుకు ఇలా జరుగుతుంది..ఆ రోజు అలా ఈ రోజు ఇలా ?

By:  Tupaki Desk   |   23 Jan 2021 10:50 AM GMT
శశికళకే  ఎందుకు ఇలా జరుగుతుంది..ఆ రోజు అలా ఈ రోజు ఇలా ?
X
శశికళ ..అలియాస్ చిన్నమ్మ . అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళ ఆరోగ్యం క్షీణించిందని విక్టోరియా ఆస్పత్రి వైద్యులు శుక్రవారం వెల్లడించారు. ఆమె ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నట్టు వైద్యవర్గాల ద్వారా తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ మూడు రోజులుగా అనారోగ్యంతో ఉన్న విషయం తెలిసిందే. కాగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో బుధవారం ఆమెను పరప్పన అగ్రహార జైలు నుంచి బెంగళూరులోని ఆసుపత్రి తరలించారు. గురువారం రాత్రి ఆమెకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

ప్రస్తుతం ఆమె ఆరోగ్యం క్షీణించిందని ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, మధుమేహం, రక్తపోటు కూడా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. శశికళ ఈ నెల 27న విడుదల కావాల్సి ఉంది. ఈ సమయంలో ఆమె అస్వస్థతకు గురికావడం ఆందోళనతో ఆమె అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. శశికళకు తొలుత యాంటిజెన్‌ పరీక్షల్లో కరోనా నెగెటివ్ ‌గా వచ్చింది. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయడంతో పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది.

జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమె జనవరి 27న విడుదల కానున్నారు. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనుండగా, తన రాజకీయ పునరాగమనానికి ఆమె ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ తరుణంలో శశికళ తీవ్ర అస్వస్థతకు గురికావడం, ప్రస్తుతం పరిస్థితి విషమించడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఆమె జైలు నుండి విడుదల అయితే ఊరేగింపుగా చెన్నైకు తీసుకెళ్ళేందుకు వెయ్యికార్లతో భారీ ర్యాలీని కూడా ఆమె మద్దతుదారులు రెడీ చేస్తున్నారు. అలాగే త్వరలోనే తమిళనాడు లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలతో మళ్లీ చిన్నమ్మ తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పాలని అనుకున్నారు. కానీ , ఇంతలో చిన్నమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారనే విషయం బయటపడటంతో అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

ఆమె ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా మారుతుంది అంటూ వార్తలు వస్తుండటంతో తమిళనాడు నుండి భారీగా ఆమె అభిమానులు బెంగుళూరుకి చేరుకుంటున్నారు. ఇదే సమయంలో గతంలో కూడా ఇలాగే జరిగింది అంటూ శశికళ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎం జయలలిత మరణించిన తర్వాత శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటారనే సమయంలో హఠాత్తుగా ఆమె అరెస్టయ్యారు. అప్పుడు కొద్దిలో సీఎం కుర్చీ మిస్ అయ్యి కటకటాల పాలైయ్యారు.

ఇపుడు మరో వారంరోజుల్లో జైలు నుండి బయటపడతారని అందరు అనుకుంటుంటే అకస్మాత్తుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరటాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందులోను ఆమె ఆరోగ్యపరిస్ధితి చాలా విషమించిందనే వార్త ఆమె అభిమానులని కుదురుగా ఉండనివ్వడం లేదు. ఇదే కేసులో శికళతో పాటు ఆమె బంధువులు ఇళవరసి, వీఎన్‌ సుధాకర్‌ 2017 ఫిబ్రవరి నుంచి పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఇళవరసి ఇంకొంత కాలం శిక్ష అనుభవించాల్సి ఉంది. ఈ కేసులో శశికళ.. ఇళవరసి కంటే ముందే అరెస్టైన నేపథ్యంలో శిక్షా కాలం ముందుగానే పూర్తి చేసుకొని విడుదలవుతున్నారు. శశికళ, ఇళవరసి జరిమానాల కింద చెరో రూ.10 కోట్లను చెల్లించారు.