Begin typing your search above and press return to search.

ఆర్టీపీసీఆర్ పరీక్ష ఎందుకు ఫెయిల్ అవుతోంది?

By:  Tupaki Desk   |   19 April 2021 4:33 AM GMT
ఆర్టీపీసీఆర్ పరీక్ష ఎందుకు ఫెయిల్ అవుతోంది?
X
ఇప్పుడంతా కరోనా గురించిన చర్చే. అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించి.. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి కావటం.. మహమ్మారి బారిన పడటం లాంటివి చాలానే చూస్తున్నాం. సెకండ్ వేవ్ లో ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే పాజిటివ్ అవుతున్న కేసులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటివేళలో.. కరోనా పాజిటివ్? నెగిటివ్? అన్నది తేల్చేందుకు యాంటీజెన్.. ఆర్టీపీసీఆర్ టెస్టుల్ని చేయించుకుంటున్న సంగతి తెలిసిందే. యాంటీ జెన్ పరీక్షల్లో కచ్ఛితత్వం తక్కువగా ఉండటం.. దాని కంటే కూడా ఆర్టీపీసీఆర్ లో కచ్ఛితత్త్వం ఎక్కువన్న ఉద్దేశంతో ఆ పరీక్షల్ని చేయించుకున్నారెందరో.

కానీ.. ఇటీవల కాలంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు సైతం తేడా కొడుతున్నాయన్న మాట అంతకంతకూ ఎక్కువ అవుతోంది. కొందరు ఆర్టీపీసీఆర్ పరీక్షను ఒక చోట కాకుండా రెండు చోట్ల చేయిస్తున్నారు. అలా చేసిన వారంతా కొత్త కన్ఫ్యూజన్ లో సతమతమవుతున్నాయి. ఏం చేయాలో తోచని పరిస్థితి. ఎందుకంటే.. ఒక పరీక్ష ఫలితం పాజిటివ్ వస్తే.. మరో పరీక్ష ఫలితం నెగిటివ్ గా వస్తోంది. దీంతో.. ఏ పరీక్షా ఫలితాన్ని నమ్మాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

అసలు ఆర్టీపీసీఆర్ పరీక్షా ఫలితం ఎందుకు తేడాగా వస్తోంది? దీనికి కారణం ఏమిటి? తప్పు ఎక్కడ జరుగుతోందన్నది ప్రశ్నగా మారింది. దీనికి పలువురు నిపుణుల్ని సంప్రదిస్తున్నప్పుడు వారు చెబుతున్న అంశాలు ఆశ్చర్యకరంగా మారుతున్నాయి. ఆర్టీపీసీఆర్ పరీక్షలో కీలకం స్వాబ్ సేకరణ. దాన్ని సేకరించే విషయంలో ఏ చిన్నపాటి పొరపాటు దొర్లినా.. ఫలితం మీద ప్రభావం పడే వీలుంది. ఒకవేళ స్వాబ్ ను సరిగానే తీసినా.. దాన్ని రవాణా చేయటంలో తేడా కొట్టినా.. ప్రయోగశాలలో సరిగా నిల్వ చేయకున్నా.. తప్పులు జరిగే వీలుంది.

అంతిమంగా తప్పుడు రిపోర్టు వచ్చే అవకాశం ఉంది. అందుకే.. ఆర్టీపీసీఆర్ పరీక్ష అయినా సరే.. ఒకటికి మూడుసార్లు పరీక్ష చేయించుకోవటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్టీపీసీఆర్ పరీక్షను రెండుచోట్ల చేయించి.. ఫలితం వేర్వేరుగా ఉంటే.. మూడోసారి పరీక్ష చేయించటం తప్పనిసరి అన్న విషయాన్ని మర్చిపోకూడదు.