Begin typing your search above and press return to search.

ఆరున్నర దశాబ్దాల తర్వాత ఆమెకు మరణశిక్షను అమలు చేయనున్న అమెరికా

By:  Tupaki Desk   |   19 Oct 2020 5:45 AM GMT
ఆరున్నర దశాబ్దాల తర్వాత ఆమెకు మరణశిక్షను అమలు చేయనున్న అమెరికా
X
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 67 ఏళ్ల తర్వాత.. తొలిసారి అమెరికాలో ఒక దోషికి మరణశిక్షను అమలు చేస్తున్నారు. ఎంత తీవ్రమైన నేరం చేసినా.. మరణశిక్షను అమలు చేయని తీరుకు భిన్నంగా తాజా ఉదంతంలో మాత్రం అమెరికా.. మరణశిక్షను అమలు చేస్తోంది. లిసా మోంట్ గోమెరీ అనే మహిళకు మరణ శిక్షను తాజాగా అమలు చేయనున్నారు. దారుణమైన నేరానికి పాల్పడిన సదరు మహిళకు.. నేరం చేసిన 16 సంవత్సరాలకు మరణ శిక్షను అమలు చేయనున్నారు.

ఆమె చేసిన నేరం వింటేనే ఒళ్లు గగుర్పాటుకు గురి కాక మానదు. ఈ తరహా నేరాల్ని చేసిన వారికి.. మరణశిక్ష విధించటం తప్పేమీ కాదన్న భావన ఎవరికైనా కలుగుతుంది. ఇంతకీ లిసా చేసిన నేరం ఏమిటంటే.. ఎనిమిది నెలల గర్భిణిని గొంతు పిసికి చంపేసింది. ఆమె కడుపును కోసి.. గర్భంలోని శిశువును కిడ్నాప్ చేసిందన్నది నేరారోపణ. 2004లో ఈ దారుణం చోటు చేసుకుంది. అప్పట్లో ఈ నేరం తీవ్ర సంచలనంగా మారింది.

ఆమె చేసిన నేరాన్ని ధ్రువీకరించిన న్యాయస్థానం ఆమెకు 2008లో మరణశిక్షను విధిస్తూ తీర్పును ఇచ్చారు. అయితే.. 2003 తర్వాత అమెరికాలో మరణశిక్షను అమలు చేయలేదు. ఒక మహిళకు మరణ శిక్షను అమలు చేయటం దశాబ్దాల తర్వాత ఇదే. 1953 డిసెంబరులో అమెరికాలో ఒక మహిళకు ఉరిశిక్షను అమలు చేశారు. ఇన్నేళ్ల తర్వాత మరోసారి మరణశిక్షను అమలు చేయనుండటం గమనార్హం.

లిసాకు విధించిన మరణశిక్షపై చర్చలు.. వాదనలు నడుస్తూ.. ఇంతకాలం మరణశిక్షను అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో లిసా ఉదంతంపై తీవ్ర చర్చ అనంతరం.. జులైలో ఆమెకు మరణశిక్షను అమలు చేయాల్సిందేనని కన్ఫర్మ్ చేశారు. తాజాగా కోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయనున్నారు. మరణశిక్షను.. విషం ఇంజెక్షన్ ను ఇవ్వటం ద్వారా.. అమలు చేయనున్నారు. దారుణమైన నేరాలకు.. మానవత్వం అన్నది లేని ఉన్మాదులకు మరణశిక్ష అమలు తప్పేం కాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.