Begin typing your search above and press return to search.

మాల్యా ఇస్తానంటే బ్యాంకులు తీసుకోవేంటి?

By:  Tupaki Desk   |   15 May 2020 6:15 AM GMT
మాల్యా ఇస్తానంటే బ్యాంకులు తీసుకోవేంటి?
X
వేల కోట్ల అప్పులు ఎగ్గొట్టి, బ్యాంకుల కొంప‌ముంచి లండ‌న్‌కు పారిపోయాడు బ‌డా పారిశ్రామిక వేత్త విజ‌య్ మాల్యా. అత‌ణ్ని భార‌త్‌కు ర‌ప్పించేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఇంకా ఫ‌లించ‌లేదు. ఐతే తాను బ్యాంకుల వ‌ద్ద చేసిన అప్పుల‌న్నీ తీర్చేస్తాన‌ని అంటున్నా ప్ర‌భుత్వం, ఆయా బ్యాంకులు అంగీక‌రించ‌ట్లేద‌ని మాల్యా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా వాదిస్తూనే ఉన్నాడు. తాజాగా భార‌త ప్ర‌భుత్వం ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిన పెట్టేందుకు గాను ప్ర‌క‌టించిన ప్యాకేజీ విష‌యంలో మాల్యా స్పందించాడు. తాను బేష‌ర‌తుగా అన్ని బ్యాంకుల‌కూ చెల్లించాల్సిన అస‌లు మొత్తాన్ని ఇచ్చేస్తాన‌ని.. ఆ మొత్తాన్ని స్వీక‌రించి త‌న‌ను రుణ విముక్తుడిని చేయాల‌ని కోరాడు. ఐతే మాల్యా ఇలా అప్పులు క‌డ‌తానంటున్నా ఎందుకు అంగీక‌రించ‌ట్లేదు అనే ప్ర‌శ్న చాలామందిలో ఉద‌యిస్తోంది.

దీని వెనుక మ‌త‌ల‌బు ఏంటంటే.. మాల్యా బ్యాంకుల‌కు క‌డ‌తానంటోంది కేవ‌లం అస‌లు మాత్ర‌మే. అత‌ను చేసిన అప్పుల‌కు వ‌డ్డీలో రెట్టింపు అయిన‌ట్లు బ్యాంకింగ్ వ‌ర్గాల స‌మాచారం. ఇండియా నుంచి పారిపోయే స‌మ‌యానికే వ‌డ్డీలు అస‌లు స్థాయిలో ఉన్నాయ‌ని.. ఇప్పుడ‌వి ఇంకో వంద శాతం పెరిగాయ‌ని.. మాల్యా కేవ‌లం అస‌లు క‌ట్టేసి కేసుల‌న్నీ మాఫీ చేయించుకోవాల‌ని చూస్తున్నాడ‌ని అంటున్నారు. అంతే కాక మాల్యా అనేక ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డి అక్ర‌మంగా దేశం విడిచి పారిపోయాడ‌ని, ఇన్నేళ్లుగా అక్ర‌మంగానే లండ‌న్‌ లో ఉంటున్నాడ‌ని.. అత‌ను వేల మంది ఉద్యోగుల జీవితాల్ని నాశ‌నం చేసి, ఇన్వెస్ట‌ర్లను ముంచేసి వెళ్లాడ‌ని.. దీనికి శిక్ష అనుభ‌వించ‌క త‌ప్ప‌ద‌ని.. కాబ‌ట్టి చ‌ట్టాల్ని అనుస‌రించి అత‌డిని భార‌త్‌ కు ర‌ప్పించి, అస‌లుతో పాటు వ‌డ్డీ కూడా క‌క్కించి.. చేసిన త‌ప్పుల‌కు శిక్ష ప‌డేలా చేయ‌డ‌మే ప్ర‌భుత్వం, బ్యాంకుల ఉద్దేశ‌మ‌ని.. అందుకే అస‌లు క‌డ‌తానంటూ అంగీక‌రించ‌ట్లేద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.