Begin typing your search above and press return to search.

పాలిటిక్స్ అంటే ఎందుకు ఎన్టీఆర్ అంత భయపడుతున్నాడు?

By:  Tupaki Desk   |   13 March 2021 11:30 PM GMT
పాలిటిక్స్ అంటే ఎందుకు ఎన్టీఆర్ అంత భయపడుతున్నాడు?
X
''కర్ణుడి చావుకు కారణాలెన్నో'' అన్నట్టుగా ఇప్పుడు ఏపీలో టీడీపీ అధికారం కోల్పోయి.. పంచాయతీ ఎన్నికల్లో తేలిపోయి.. నాయకత్వ పటిమ దిగజారిపోవడానికి తండ్రీకొడుకులు చంద్రబాబు-లోకేష్ ల తీరు కారణమని రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు. అందుకే ఈ మధ్య చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తే పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు వెలిసి ఆయన రావాలంటూ ఏకంగా చంద్రబాబునే అడిగేసిన పరిస్థితి. కానీ చంద్రబాబు మాత్రం దీనిపై దాటవేసి తాను, లోకేష్ అందుబాటులో ఉంటామంటూ తప్పించుకున్న వైనం మీడియాలో చర్చకు దారితీసింది.

అయితే ఎవ్వరు ఏమన్నా సరే చంద్రబాబుకు వయసైపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే సమయంలో తండ్రి వారసత్వాన్ని లోకేష్ అందిపుచ్చుకోవడం లేదన్నది తెలుగు తమ్ముళ్ల బాధ. స్వయంగా పోటీచేసి మరీ గెలవలేకపోవడం.. లోకేష్ భాషపటిమ, నాయకత్వ లోపాలు తెలుగు తమ్ముళ్లను మరో ఆప్షన్ అయిన 'జూనియర్ ఎన్టీఆర్' వైపు చూసేలా చేశాయి.

అందుకే ఎన్టీఆర్ రావాలి.. చంద్రబాబు చేతిలో ఉన్న వాళ్ల తాత పెట్టిన పార్టీని లీడ్ చేయాలన్న డిమాండ్ స్వయంగా తెలుగు తమ్ముళ్ల నుంచే వస్తోంది.

అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు.ఏకంగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' చేశాడు. ఆ సినిమా రిలీజ్ అయితే ఏకంగా ప్యాన్ ఇండియా స్టార్ అయిపోతాడు. తిరుగుండదు. ఇక ఆ తర్వాత కూడా ప్యాన్ ఇండియా మూవీలే చేస్తున్నాడు.. తెలుగుతోపాటు దేశవ్యాప్తంగా మార్కెట్ విస్తరించి స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు.

ఇలాంటి కీలక సమయం సందర్భంలో అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చి కెరీర్ పాడుచేసుకునేందుకు ఎన్టీఆర్ సిద్ధంగా లేడన్నది ఆయన సన్నిహితుల నుంచి వినిపిస్తున్న వాదన.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కెరీర్ నాశనం చేసుకొని రాజకీయాల్లోకి వచ్చినా చంద్రబాబు-లోకేష్ లను ఎదుర్కోవడం ఎన్టీఆర్ కు కష్టమే. వారి పార్టీని చేజిక్కించుకోవడం తలకు మించిన పని. అంత ఈజీగా పార్టీని వదిలే రకం చంద్రబాబు కాదు. ఆయన వెనుక బలమైన శక్తులున్నాయన్నది ఎన్టీఆర్ కు తెలుసు. అందుకే సమయం కోసం ఎదురుచూడడమే ఎన్టీఆర్ ముందున్న కర్తవ్యంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం టీడీపీ చంద్రబాబు-లోకేష్ ల కబంధ హస్తాల్లో నలిగిపోయిందని ఎన్టీఆర్ కు తెలుసు అని.. అందుకే చంద్రబాబు రాజకీయాల్లోకి రిటైర్ అయ్యాక.. లోకేష్ ఫ్లాప్ అయ్యాకే ఎన్టీఆర్ వస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు దిగిపోతే లోకేష్ తో టీడీపీని నడపడం వల్ల కాదని.. అప్పుడు అందరి కోరిక మేరకు వస్తే ఎన్టీఆర్ కు తిరుగు ఉండదని.. ఇప్పుడు యువకుడే కావడం.. సినిమా కెరీర్ ఉజ్వలంగా ఉండడంతో ఇప్పుడు ఫోకస్ మార్చుకోకూడదని ఎన్టీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

అందుకే విలేకరుల సమావేశంలో 'రాజకీయాల్లోకి ఎంట్రీపై ' ప్రశ్న వచ్చినప్పుడు 'ఇది సమయం.. సందర్భం కాదని' మాత్రమే ఎన్టీఆర్ సమాధానం ఇచ్చాడు. అంటే భవిష్యత్ లో రావచ్చు అనేలా హింట్ ఇచ్చాడు. ఈ మాటలు ఇప్పుడు చంద్రబాబు-లోకేష్ లకు నిద్రపట్టకుండా చేస్తాయోనన్న చర్చ సాగుతోంది. భవిష్యత్ లో ఎన్టీఆర్ రాజకీయాల్లో వస్తాడన్న ఊహాగానాలకు ఆయన మాటలే దోహదం చేస్తున్నాయని అంటున్నారు.