Begin typing your search above and press return to search.

దేశ విభజన చేసిన ఆయన్ను భారతీయులు ‘సర్’ అనే అంటారెందుకు?

By:  Tupaki Desk   |   15 Aug 2021 3:30 PM GMT
దేశ విభజన చేసిన ఆయన్ను భారతీయులు ‘సర్’ అనే అంటారెందుకు?
X
బ్రిటిషోడి నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందెప్పుడు అన్నంతనే ఆగస్టు 15, 1947 అనే మాటను దేశంలోని ప్రతి పిల్లాడి నుంచి ముసలైన వారి వరకు అందరి నోటి నుంచి వచ్చేస్తుంది. కానీ.. దేశానికి సంపూర్ణంగా స్వాతంత్ర్యం లభించింది మాత్రం 1950జనవరి 26నే అని చెప్పే వారు చాలా తక్కువమంది కనిపిస్తారు. దేశానికి స్వాతంత్య్రాన్ని ఇచ్చేందుకు ముందుగా తెల్లోడు దేశాన్ని రెండు ముక్కలు చేయటానికి ఓకే చెప్పేయటం తెలిసిందే.

మరి.. విభజన చేసిందెవరు? భారత్.. పాక్ అనే దేశాలకు సరిహద్దులుగా ఉండాలని డిసైడ్ చేసిందెవరు. ఏ భాగం ఎవరికి అన్న విషయాన్ని తేల్చి.. కోట్లాది మందిని నిరాశ్రయిల్ని చేసి.. కోట్ల మందిని వలస బాట పట్టించి.. లక్షల మందిని నిరాశ్రయలు్ని చేసింది ఎవరు? ఆ పాపానికి కారణం ఎవరు? అంటే.. సర్ సైరిల్ రాడ్ క్లిఫ్ అనే పేరు వినిపిస్తుంది. కోట్లాది మంది కడుపు మండేలా..గుండె రగిలేలా.. కన్నీళ్లు కార్చేలా చేసిన ఆయన్ను సర్ అనే మాట ఎలా అంటారు? అన్న డౌట్ రావొచ్చు. కానీ.. ఆయన గురించి మొత్తం తెలిసిన తర్వాత మాత్రం.. ఆయన్ను సర్ అని పిలిచినా తప్పు లేదన్న భావన కలగటం ఖాయం.

రక్తం చుక్క చిందకుండా స్వాతంత్య్ర పోరాటం జరిగినట్లుగా.. అనుకున్నది సాధించినట్లు చెప్పినా.. స్వాతంత్య్రం వచ్చినంతనే జరిగిన గొడవల్లో లక్షలాది మందికి ఎదురైన భయంకర అనుభవాలెన్నో. దీనికి కారణం విభజన రేఖలు గీసిన తీరే. ఇంతకూ రెండు దేశాల విభజన రేఖల్ని తీసే బాధ్యతను రాడ్ క్లిఫ్ కు ఎందుకు అప్పగించారు బ్రిటీష్ వాళ్లు అంటే.. ఆయన ప్రొఫెసనల్ గా లాయర్ కావటం.. ఆయనకు భారత్ గురిచి ఎలాంటి అవగాహన లేకపోవటం కూడా కారణంగా చెప్పాలి. ఆయనకు సాయం చేసేందుకు భారత్ కు చెందిన ఇద్దరిని.. పాకిస్థాన్ కు చెందిన ఇద్దరు లాయర్లను సహాయకులుగా నియమించారు. విభజన జరిగే వేళలో ఆయనకు వారిని సాయంగా ఉంచారు.

నిజానికి విభజన పంచాయితీ అంతా కూడా పంజాబ్.. పశ్చిమ బెంగాల్ ను విడదీసే విషయంలోనే. రెండు దేశాల్ని విడదీసే భారీ బాధ్యత కోసం బ్రిటిషర్లు ఇచ్చిన సమయం ఎంతో తెలుసా? అక్షరాల ఐదువారాల్లో పని పూర్తి చేయాలని టార్గెట్ ఇచ్చేశారు. దీంతో.. 1947 జులై 8న ఢిల్లీలో అడుగు పెట్టిన రాడ్ క్లిఫ్.. ఆగస్టు 12 నాటికి పూర్తి చేసేశారు. భారత్ గురించి ఏ మాత్రం తెలీకుండా.. చివరకు బెంగాల్.. పంజాబ్ ప్రాంతాలు ఎక్కడ ఉంటాయో కూడా రాడ్ క్లిప్ కు తెలీకుండానే దేశ విభజనను పూర్తి చేయటం విశేషం. మతపరమైన జనాభానే ప్రధానాంశంగా తీసుకొని.. సహజసిద్ధమైన సరిహద్దులు.. రవాణా.. జలవనరులు.. సామూహిక రాజకీయ పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని విభజన చేసేశారు.

ఇది విన్నంతనే రాడ్ క్లిఫ్ మీద విపరీతమైన కోపం వస్తుంది. కానీ.. ఆయన తనకు అప్పగించిన బాధ్యతను నిజాయితీతో చేశారని చెప్పాలి. తనకున్న పరిమితకాలంలో ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. ఎప్పుడైతే విభజన చేసేసి తన దారిన తాను వెళ్లిపోయారు.. ఆ తర్వాత రెండు వైపులా భారీ స్థాయిలో మారణకాండ చెలరేగిందన్న వార్తలు విన్న ఆయన.. తనకు ప్రభుత్వం ఇచ్చిన జీతభత్యాల్ని కూడా తిరస్కరించారు. తీవ్ర ఆవేదనతో గడిపారు. ఇదే.. ఆయన్ను ‘సర్’ అని భారతీయులు పిలిచేందుకు మొగ్గు చూపుతారు.

భారత్ గురించి ఏ మాత్రం అవగాహన లేని వ్యక్తి.. తనకు చెప్పిన పనిని చెప్పినట్లుగా చేసేయటం.. అందుకు తనకున్న అవగాహనతో గీసిన గీతలు.. నిర్ణయించిన హద్దులు కోట్లాది మంది ప్రజల బతుకుల్ని.. భవిష్యత్తును నిర్దేశించాయి. అంతేకాదు.. భారీ మారణహోమానికి కారణమయ్యాయి. 1967లో ప్రముఖ జర్నలిస్టు కులదీప్ నయ్యర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాడ్ క్లిప్ మాట్లాడుతూ.. తనకు చాలా తక్కువ సమయం ఇచ్చారని.. ఐదు వారాల్లో తాను అంత బాగా చేయలేకపోయానని ఒప్పుకున్నారు.

కనీసం రెండు మూడు సంవత్సరాలు సమయం ఇచ్చి ఉంటే.. మరింత మెరుగ్గా ఉండేదేమోనని చెప్పారు. వాస్తవానికి లాహోర్ ను తొలుత భారత్ కు కేటాయించిన ఆయన.. పాక్ కు పెద్ద పట్టణం లేదన్న కారణంగా ఆ పట్టణాన్ని పాక్ లోనే ఉంచాల్సి వచ్చిందన్నారు. విభజన వేళ పంపకాలు విచిత్రంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫర్నీచర్.. ఇతర సామాగ్రి పంచుకునే విషయంలో విపరీతమైన గొడవలు జరిగాయి.

దీంతో బల్లలు ఒక దేశానికి వెళితే.. కుర్చీలు మరో దేశానికి వెళ్లాయి. లైబ్రరీలలో A నుంచి K వరకు ఒక దేశానికి.. అక్షరమాలలో మిగిలిన అక్షరాల పేరుతో ఉండే పుస్తకాల్ని మరో దేశానికి పంచిన విచిత్రమైన విభజన పంపంకంగా చెప్పాలి. ఇలా ఎన్నో సిత్ర విచిత్రాలకు భారత స్వాతంత్ర్య దినోత్సవానికి కాస్త ముందుగా జరిగిందని చెప్పాలి. అంతేకాదు.. విభజనకు సంబంధించిన హద్దుల్ని కాస్త ఆలస్యంగా ప్రకటించటం కూడా జరిగింది. ఎందుకంటే.. గొడవలు అవుతాయన్న ఉద్దేశంతో అలాంటి నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికి గొడవలు తప్పలేదు.. మారణహోమంలో లక్షలాదిగా మరణించటం గమనార్హం.