Begin typing your search above and press return to search.

లెక్కలు తీసుకొని దుబ్బాక బస్టాండ్ కు రా హరీశ్?

By:  Tupaki Desk   |   24 Oct 2020 5:45 AM GMT
లెక్కలు  తీసుకొని దుబ్బాక బస్టాండ్ కు రా హరీశ్?
X
ఎప్పుడూ దిమ్మ తిరిగే పంచ్ లు వేయటమే తప్ప.. వేయించుకోవటం అలవాటు లేని టీఆర్ఎస్ అధినాయకత్వానికి తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఏం చేయాలో అర్థం కానివిగా తయారవుతున్నాయట. మిగిలిన రోజుల సంగతి వేరు. ఓవైపు కీలకమైన ఉప ఎన్నిక జరుగుతున్న వేళ.. గతంలో మరెప్పుడు లేని విధంగా ఎదురవుతున్న ఎదురుదాడికి ఫైర్ బ్రాండ్ హరీశ్ వర్గం నోటి నుంచి మాటలు రాలేని పరిస్థితి. ఇష్యూ ఏదైనా సరే.. పంచ్ వేస్తే.. గులాబీ దళమే వేయాలన్నట్లుగా ఉండేది.

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల గురించి నిలదీయాలన్నా.. భావోద్వేగాల్ని టచ్ చేసేలా మాట్లాడాలన్నా.. సెంటిమెంట్లతో షాకులు ఇవ్వాలన్నా గులాబీ దళానికి మించినోళ్లు ఉండేవారు. మిగిలిన వారెన్ని మాట్లాడినా.. గులాబీ నేతల నోటి నుంచి వచ్చే మాటలు తెలంగాణ ప్రజల్ని నేరుగా తాకేవి. అలాంటి దానికి భిన్నమైన పరిస్థితి తాజాగా నెలకొందని చెబుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. బీడీ కార్మికులకు నెలసరి ఇచ్చే సాయం.. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని.. కేంద్రం నయా పైసా కూడా ఇవ్వట్లేదని మంత్రి హరీశ్ మండిపడుతున్నారు.

రాష్ట్ర ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్న తనకు లెక్కల మీద అవగాహన ఉందని.. ఆ అవగాహనతోనే తాను చెబుతున్నానని.. బీడీ కార్మికులకు ఇచ్చే ఆర్థిక సాయంలో కేంద్రం వాటా ఉన్నట్లు చూపిస్తే.. తాను తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆయన సవాలు కూడా విసురుతున్నారు. దుబ్బాక ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న కమలనాథులు.. దమ్ముంటే.. తాను విసిరిన సవాలును స్వీకరించి.. ఆ లెక్కల్ని తీసుకొని దుబ్బాక బస్టాండ్ కు రావాలని హరీశ్ ఫైర్ అయ్యారు.

ఇదంతా చూసిన గులాబీ దళానికి .. హరీశ్ రావు ‘ఫైరింగ్’ తెగ సంతోషాన్ని ఇచ్చింది. అయితే.. ఇక్కడే హరీశ్ లెక్క తప్పింది. తాను ఏ లెక్కలు తీసుకొని ‘దుబ్బాక బస్టాండ్ కు రా’ అన్న సవాలుకు కమలనాథులు సరికొత్తగా స్పందిస్తున్నారు. అయ్యా హరీశ్ గారు.. అంటూ చాలా మర్యాదగా ‘డబుల్ బెడ్రూం ఇళ్లు.. ఉద్యోగాల.. నిధులు.. డెవలప్ మెంట్.. దళితులకు భూమి’’ ఇలా ఒకటేమిటి టీఆర్ఎస్ అధినేత ఇచ్చిన హామిల్ని ఏకరువు పెడుతూ.. మా దగ్గర ఉన్న లెక్కల్ని తెస్తాం.. మీ దగ్గర ఉన్న లెక్కలు తీసుకొని దుబ్బాక బస్టాండ్ కు రా హరీశ్ అంటూ.. ఎవరికి వారు సవాలు విసురుతున్న వైనం ఇప్పుడు మహా ఇబ్బందికరంగా మారిందట.

దుబ్బాక బస్టాండ్ కు రా.. అంటూ పలువురు సామాన్యులు మంత్రి హరీశ్ కు సవాలు విసరటం.. ఆ వీడియోలు వైరల్ గా మారటం.. వాటిపై గులాబీ దళం ఎలాంటి స్పందన లేకపోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో ఈ తరహా సవాళ్లకు అదే పనిగా వాదనలు వినిపించే టీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు కామ్ కావటం.. కీలకమైన ఎన్నికల వేళ ఇబ్బందికరంగా మారినట్లుగా చెబుతున్నారు. ఏ ముహుర్తంలో ‘దుబ్బాక బస్టాండ్ కు లెక్కలు తీసుకొని రా’ అంటూ హరీశ్ సవాలు విసిరారో.. అది కాస్తా రివర్సులో ఇప్పుడు ఆయన్ను చుట్టుకోవటం.. ఎంతకూ వదలకపోవటంతో ఆయన విపరీతంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట.