Begin typing your search above and press return to search.

అంతలా వాటేసుకోవటం.. అంతలోనే విరుచుకుపడటం.. కేసీఆర్ కే సాధ్యం

By:  Tupaki Desk   |   22 July 2021 1:30 PM GMT
అంతలా వాటేసుకోవటం.. అంతలోనే విరుచుకుపడటం.. కేసీఆర్ కే సాధ్యం
X
కౌగిలించుకోవటం.. అంతలోనే కత్తులు దూయటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు వచ్చినంత బాగా మరెవరికీ రాదనే చెప్పాలి. అప్పటివరకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తిని అదాటున వదిలించుకోవటం.. తీవ్రమైన ఆరోపణలు చేయటమే కాదు.. మాటల కత్తి ఎత్తి వారిని రాజకీయంగా ఖతం చేసే వరకు వదిలిపెట్టని మొండితనం కనిపిస్తుంది. అంతేనా.. అప్పటివరకు కత్తులు నూరిన నేతను.. తన రాజకీయ అవసరాలకు అనుగుణంగా తన మాటను మాత్రమే కాదు చేతల్లోనూ మార్పులు తీసుకొస్తారు. కొత్త దోస్తానాను షురూ చేశారు.

అప్పటివరకు కత్తులు దూశారు కదా? అన్న ప్రశ్న ఎవరి నోటి నుంచి రాకుండా జాగ్రత్తలు తీసుకోవటమే కాదు.. క్వశ్చన్ చేసే అవకాశాన్ని ఇవ్వరు. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు తోపులు.. తురంఖాన్ లుగా చెప్పుకనే మొనగాడు నేతల్ని పార్టీ బయటకు పంపేసి.. వారి అడ్రస్ గల్లంతు చేసిన ఘన చరిత్ర కేసీఆర్ సొంతమని చెప్పక తప్పదు.

తాజాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ ను చెప్పాలి. అప్పటివరకు కాబినెట్ లో పెద్దపీట వేయటమే కాదు.. తెలంగాణ ఉద్యమంలో ఈటల చేసిన సేవ గురించి.. ఆయన పోరాటాన్ని పదే పదే ప్రస్తావించి.. ఆయన్ను పొగిడిన పెద్ద మనిషి.. ఇవాల్టి రోజున ఆయనకు ఎలాంటి పరిస్థితిని తీసుకొచ్చారో తెలిసిందే. ఈటల రాజేందర్ ఉన్నంత కాలం హుజూరాబాద్ వరకు పార్టీకి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదు. ఎప్పుడైతే ఈటల కారు దిగేసి.. కమలం గూటికి చేరుకున్నారో.. అప్పటి నుంచి ఆయనకు తగ్గ నేతను ఎంపిక చేసే పనిలో పడ్డారు.

కాంగ్రెస్ యువనాయకుడిగా.. ఈటలకు తరచూ సవాలు విసిరే కౌశిక్ రెడ్డి సరైన నేతగా భావించిన కేసీఆర్.. యుద్ధ ప్రాతిపదికన ఆయన్ను పార్టీలో చేరేందుకు వీలుగా గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. తొలుత కొడుకు కమ్ మంత్రి కేటీఆర్ తో రాయబేరాన్ని నడిపిన కేసీఆర్.. తమ అవసరాలకు తగ్గట్లుగా కౌశిక్ ను తయారు చేసుకుంటున్నారు. తాజాగా పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇదే కౌశిక్ రెడ్డిపై గతంలో కత్తులు నూరిన కేసీఆర్.. ఇప్పుడు ఆయన్ను కౌగిలించుకోవటమే కాదు.. అతడి తండ్రికి తనకు మధ్యనున్న దోస్తానాను గుర్తు చేశారు.

పార్టీ చేరిన సందర్భంగా తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన కేసీఆర్.. కౌశిక్ రెడ్డి తండ్రి తనకు చిరకాల మిత్రుడని.. 2001లో గులాబీ జెండాను ఎగురవేసినప్పుడు తనతో పాటు భుజం కలిపిన వారిలో అతడు కూడా ఒకరని గుర్తు చేశారు. అలాంటి తన పాత స్నేహితుడు కొడుకును పార్టీలోకి ఆహ్వానించటమేకాదు.. అతనికి పార్టీలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాదు..కౌశిక్ రెడ్డి వెంట పార్టీ నేతలంతా ఉండాలని ఫర్మానాను జారీ చేశారు.

ఇదంతా చూసినోళ్లు.. పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ వెంట ఉన్న కౌశిక్ తండ్రి తర్వాత ఏమయ్యారు? ఎక్కడకు వెళ్లారు? అంత దోస్త్ ను కేసీఆర్ ఎందుకు విడిచిపెట్టారు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తర్వాత అయినా తన మిత్రుడ్ని పిలిచి.. మంచి పదవి ఇస్తే వచ్చే వారు కదా? ఈటల ఎపిసోడ్ జరిగి.. ఆయన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాతనే కౌశిక్.. ఆయన తండ్రి ముచ్చట కేసీఆర్ కు గుర్తుకు రావటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్న. ఇదంతా చూసినోళ్లకు కత్తులు నూరాలన్నా.. కౌగిలించుకోవాలన్నా కేసీఆర్ తర్వాతే ఎవరైనా అన్న భావన కలుగక మానదు.