Begin typing your search above and press return to search.

నవంబరు 11 తర్వాతే గ్రేటర్ ఎన్నికలు ఎందుకు?

By:  Tupaki Desk   |   30 Sep 2020 7:00 AM GMT
నవంబరు 11 తర్వాతే గ్రేటర్ ఎన్నికలు ఎందుకు?
X
తెలంగాణలో ఎన్నికల సందడి షురూ అయినట్లే. గడిచిన కొద్దిరోజులుగా అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలంతా ఎన్నికల గురించి అదే పనిగా మాట్లాడుకోవటమే కాదు.. అందుకు సన్నాహాకాల్లో బిజీబిజీగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ కు జరిగే కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన ఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది. ఇప్పటివరకు గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడే అవకాశం ఉందన్న విషయంపై క్లారిటీ లేకున్నా.. తాజాగా అధికారులు వినిపిస్తున్న వాదన ప్రకారం.. నవంబరు 11 తర్వాత ఏ క్షణంలో అయినా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వీలుంది.

గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ నవంబరు 11 తర్వాతే ఎందుకు విడుదల కానుంది? దీనికున్న లింకు ఏమిటన్నది చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. జీహెచ్ఎంసీ యాక్ట్ 1955.. అందులోని ఆరేడు సెక్షన్ల ప్రకారం ప్రస్తుతం పవర్ లో ఉన్న పాలక మండలి గడువు ముగియటానికి మూడు నెలల ముందు ఎన్నికల ప్రక్రియ నిర్వహించే అవకాశం ఉంది.

ఈ లెక్కన చూసినప్పుడు ప్రస్తుతం కొలువు తీరి ఉన్న పాలక మండలి 2016 ఫిబ్రవరి 11న బాధ్యతల్ని చేపట్టింది. ఈ లెక్కన చూసినప్పుడు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న గడువు ముగియనుంది. ఈ లెక్కన చూసుకుంటే నవంబరు 11 నాటికి మూడు నెలల సమయం మాత్రమే ఉంటుంది. అందుకే నవంబరు 11.. ఆ తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే.. గ్రేటర్ ఎన్నికలకు మరో 40 రోజుల మాత్రమే సమయం ఉందని చెప్పక తప్పదు.

ఈ వాదనకు బలం చేకూరేలా అధికారపక్షం ఎన్నిలకు సంబంధించిన కసరత్తును ముమ్మరం చేయటంతో పాటు.. శ్రేణుల్ని ఉత్తేజపరుస్తోంది. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో ఈసారి సెంచరీ దాటేయాలన్న లక్ష్యంగా పని చేస్తుంది. ప్రతి అంశాన్ని సునిశితంగా పరిశీలించటంతో పాటు.. ఏ చిన్న లోపానికి తావు ఇవ్వకుండా గెలుపు దిశగా పరుగులు పెట్టాలని భావిస్తోంది.