Begin typing your search above and press return to search.

కశ్మీర్ పై మోడీ మాస్టర్ స్ట్రోక్ పై గాంధీ ఫ్యామిలీ మౌనమేల?

By:  Tupaki Desk   |   6 Aug 2019 9:05 AM GMT
కశ్మీర్ పై మోడీ మాస్టర్ స్ట్రోక్ పై గాంధీ ఫ్యామిలీ మౌనమేల?
X
ముందు చూస్తే నుయ్యి.. వెనుక చూస్తే గొయ్యి.. ఇలాంటి వేళ ఎవరు ఇరుక్కుపోయినా ఏం చేస్తారు? కామ్ గా ఉండిపోతారు. ఉన్న చోటనే నిలబడి.. ఏదో ఒకటి తనకు అనుకూలంగా జరిగే పరిణామం కోసం ఆశగా ఎదురుచూస్తుంటారు. ఇంచుమించే ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది గాంధీ కుటుంబం. సంచలన నిర్ణయాన్ని తీసుకున్న మోడీ సర్కారుపై ఇప్పటివరకూ విపక్ష కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానైనట్లుగా ఉండే గాంధీ ఫ్యామిలీ సభ్యులు ఎవరూ కామెంట్ చేయని పరిస్థితి.

జమ్ము కశ్మీర్ పునర్విభజన బిల్లుతో పాటు.. అధికరణ 370ను మార్పులు చేర్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న మోడీ ప్రభుత్వం.. మాస్టర్ స్ట్రోక్ కొట్టిందనే చెప్పాలి. ఇలాంటి వేళ.. వెంటనే స్పందించే అలవాటున్న గాంధీ కుటుంబం ఈసారి తన తీరుకు భిన్నంగా కామ్ గా ఉంది. మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వారిప్పుడు మౌనాన్ని ఆశ్రయించిన పరిస్థితి. పార్టీ స్టాండ్ ప్రకారం వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే జరిగే డ్యామేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే హిందూ వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే పార్టీగా కాంగ్రెస్ పై పలువురు నిప్పులు కక్కుతున్నారు.

లౌకికవాదం పేరుతో కొందరికి కొమ్ము కాసే తీరు కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీస్తుందన్న మాట వినిపిస్తోంది. ఈ తీరుతో ఇప్పటివరకూ జరిగిన డ్యామేజీ చాలని.. పాత పద్దతినే కంటిన్యూ చేస్తే.. రానున్న రోజుల్లో మరింత డ్యామేజ్ జరిగే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఈ కారణంతోనే ఈ విషయం మీద కాంగ్రెస్ పార్టీకి కీలకమైన సోనియా.. రాహుల్.. ప్రియాంకలు పెదవి విప్పటం లేదంటున్నారు. ఇప్పుడు తాము నోరు విప్పి.. మోడీ సర్కారు నిర్ణయానికి సానుకూలంగా స్పందిస్తే.. పదేళ్లు చేతిలో అధికారంలో ఉండి కూడా ఏమీ ఎందుకు చేయలేదు? అన్న ప్రశ్న ఎదురవుతుంది. అదే సమయంలో.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పై వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో.. ఎలాంటి కామెంట్ చేయకుండా కామ్ గా ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.