Begin typing your search above and press return to search.

లాస్ ఏంజెల్స్ లో ఆ ప్లేస్ కు క్యాబ్ డ్రైవర్లు ఎందుకు వెళ్లటం లేదంటే?

By:  Tupaki Desk   |   17 Feb 2020 9:30 PM GMT
లాస్ ఏంజెల్స్ లో ఆ ప్లేస్ కు క్యాబ్ డ్రైవర్లు ఎందుకు వెళ్లటం లేదంటే?
X
ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడా 19 (కరోనా) వైరస్ అమెరికాలోని లాస్ ఏంజెల్స్ మహానగరంలో కొత్త సమస్యకు కారణంగా మారింది. ఇప్పటికే అమెరికాలోని పలు ప్రాంతాల్లో చైనీయులు కనిపిస్తే చాలు.. స్థానికులు దాడి చేస్తున్న ఉదంతాలు కొన్ని బయటకు వస్తున్నాయి. దీంతో.. బయటకు వెళ్లాలంటే చైనీయులు ఒకటికి రెండుమార్లు ఆలోచించుకోవాల్సిన దుస్థితి. ఇదిలా ఉంటే.. లాస్ ఏంజెల్స్ లాంటి మహా నగరం లో క్యాబ్ డ్రైవర్లు అనుసరిస్తున్న వైనానికి అక్కడి అధికారులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చట్టాన్ని మరింత కరకుగా అమలు చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు.

చైనీయుల కారణంగా కొవిడా వైరస్ తమకు వ్యాప్తి చెందుతుందన్న భయాన్ని అమెరికన్లు వ్యక్తం చేస్తున్నారు. చైనీయులు కనిపిస్తే చాలు.. వారిని తిట్టిపోస్తున్నారట. ఇలాంటి ఉదంతమే లాస్ ఏంజెల్స్ లో చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే.. మరో సమస్య ఇక్కడ ఉంటున్న చైనీయులకు ఇబ్బందిగా మారింది. లాస్ ఏంజెల్స్ లోని ఫ్లషింగ్ అనే ప్రాంతంలో దగ్గర దగ్గర 70వేల మంది వరకూ చైనీయులు నివసిస్తుంటారు. దీంతో.. ఈ ప్రాంతానికి వెళ్లేందుకు క్యాబ్ డ్రైవర్లు వణుకుతున్నారు.

లాస్ ఏంజెల్స్ లో ఇప్పటివరకూ ఒక్క కొవిడ్19 వైరస్ కేసులు బయటకు రాకున్నా.. చైనీయుల కారణంగా ప్రమాదకర వైరస్ తమకు వ్యాపిస్తుందేమోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో.. వారున్న ప్రాంతాలకు వెళ్లినంతనే క్యాబ్ డ్రైవర్లు ఆఫ్ లైన్లోకి వెళ్లిపోతున్నట్లు చెబుతున్నారు. మరికొందరు తమ క్యాబ్ బుక్ చేసింది చైనీయులన్న విషయం తెలిసినంతనే రైడ్ ను క్యాన్సిల్ చేస్తున్నారు. దీనిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యాబ్ సర్వీస్ ఇచ్చేందుకు నిరాకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు.

క్యాబ్ డ్రైవర్లు వివక్ష తో ట్రిప్ క్యాన్సిల్ చేస్తే మొదటిసారి 500 డాలర్లు..రెండోసారి వెయ్యి డాలర్ల జరిమానాతో పాటు నెల రోజులు డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామంటున్నారు. మూడోసారీ ఇదే తరహాలో తప్పు చేస్తే శాశ్వితంగా డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేస్తామని తేల్చి చెబుతున్నారు. ఇలాంటి కఠిన నిర్ణయాల తో అయినా లాస్ ఏంజెల్స్ లో పరిస్థితి మారుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.