Begin typing your search above and press return to search.

నరసింహన్ గవర్నర్ పోస్ట్ ఊస్టేనా?

By:  Tupaki Desk   |   3 Jun 2019 10:25 AM GMT
నరసింహన్ గవర్నర్ పోస్ట్ ఊస్టేనా?
X
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఖేల్ ఖతమయ్యేటట్టే కనిపిస్తోంది. ఆయనను రెండోసారి అధికారంలొకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మార్చేటట్టే కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎదుగుదామనుకుంటున్న బీజేపీకి కలలకు నరసింహన్ ప్రధాన అడ్డుగా ఉండడమే ఇందుకు కారణంగా తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారు. మునిపటిలా తెలంగాణ-ఆంధ్ర మధ్య విభేదాలు, విభజన సమస్యలు లేవని.. అందుకే నరసింహన్ తో పనిలేదని.. తొందరగా మార్చేయాలని తెలంగాణ బీజేపీ నేతలు కోరుతున్నారు. దీన్ని బట్టి కేంద్రంలోని పెద్దలే ఇలాంటి లీకులు ఇస్తే గవర్నర్ గా నరసింహన్ ను సాగనంపేందుకు ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతోంది.

నరసింహన్ తెలంగాణలో, అటు ఏపీలో మొన్నటి వరకు సమదూరం పాటిస్తూ విభజన సమస్యలపై చొరవచూపారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం విడిపోక ముందునుంచి ఉండడంతో రెండు రాష్ట్రాల గొడవలపై ఆయనకు క్లారిటీ ఉంది. తెలంగాణ, ఏపీ తెనెతెట్టే విభజన కావడంతో నరసింహన్ ను కూడా మార్చే సాహసం మోడీ ప్రభుత్వం చేయలేదు. కాంగ్రెస్ సానుభూతి గవర్నర్ అయినా కొనసాగించింది.

అయితే నరసింహన్ మాత్రం తెలంగాణలో కేసీఆర్ ను అందలమెక్కిస్తున్నారు. బీజేపీ నేతలు ఎంత కోరినా.. ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. పైగా కేసీఆర్ పాలనను పొగుడుతున్నారు. ఇటీవల వీసీల సమావేశంలో వీసీల పనితీరును సైతం ప్రశంసించారు. దీనిపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. యూనివర్సిటీల్లో చాలా ఖాళీలున్నాయని.. 70శాతం పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నా గవర్నర్ నరసింహన్ ఎలా వెనకేసుకొస్తారని నిలదీశారు. ఇక అవసరం లేకున్నా కేసీఆర్ ను వెనకేసుకురావడాన్ని తెలంగాణ బీజేపీ నేతలు హర్షించడం లేదు. పైగా మొన్నటి తెలంగాణ ఇంటర్ అవకతవకల్లో కూడా కేసీఆర్ సర్కారుపై బీజేపీ పోరాడినా గవర్నర్ స్పందించలేదు.

అందుకే తానా అంటే తందానా అంటున్న గవర్నర్ ను బదిలీ చేయించడానికి తెలంగాణ బీజేపీ నేతలు సిద్ధమైనట్టు తెలిసింది. కేసీఆర్, జగన్ లు సామరస్యపూర్వకంగా ఉంటుండడంతో ఇక గవర్నర్ నరసింహన్ ను తొలగించి రెండు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లను నియమించాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. ఇది తొందరలోనే నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి.