Begin typing your search above and press return to search.

కేంద్రంలో కాంగ్రెస్ రావాలని ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారు.. అందుకేనా?

By:  Tupaki Desk   |   15 May 2021 11:51 AM GMT
కేంద్రంలో కాంగ్రెస్ రావాలని ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారు.. అందుకేనా?
X
దేశంలో మోడీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం ప్రాధాన్యత అంశాలు మారిపోయాయన్నది నిజం. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ.. కార్పొరేట్లకు దోచిపెడుతున్నారనే విమర్శలు మేధావుల నుంచి వస్తున్నాయి. మోడీ సర్కార్ వచ్చాక దేశంలో కార్పొరేటీకరణ ఎక్కువ అయ్యిందన్నది వాస్తవం అంటున్నారు. ఆర్థికంగా ప్రజలకు భరోసా కల్పించడంలో మోడీ సర్కార్ ఫెయిల్ అయ్యిందన్న ఆవేదన సామాన్యుల్లో ఉంది. అన్ని మాట ముచ్చట్లు.. ప్రసంగాలతోనే కాలం గడుపుతున్నారని.. 'మేకిన్ ఇండియా' అని కోట్ల ఉద్యోగాలు అని.. కార్పొరేట్లకే మేలు చేశారని.. ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

మోడీ ఫెయిల్యూర్ స్పష్టంగా కరోనా లాక్ డౌన్ తో మరోసారి రుజువైందంటున్నారు. కరోనా లాక్ డౌన్ తో కుదేలైన దేశ ప్రజల సంపదను తిరిగి సంపాదించి పెట్టే చర్యలు మోడీ తీసుకోలేదనే విమర్శ ఉంది. ‘ఆత్మ నిర్భర భారత్’ అంటూ 20 లక్షల కోట్లు ప్రకటించారని.. అవి ఏమయ్యాయని ప్రతి ఒక్కరూ ప్రశ్నించారు. పేదలకు ఉపయోగ పడలేదని.. లాక్ డౌన్ తో ఆదాయం కోల్పోయిన వారిని మోడీ ఏం చేయలేకపోయారని అపవాదును మూటగట్టుకున్నారు.

ఇలా చెప్పుకుంటూ పోతే మోడీ ఫెయిల్యూర్ ల జాబితా చాంతాడంత అవుతుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. రెండోసారి అధికారంలోకి వచ్చాక మోడీ ప్రజా ఉపయోగ నిర్ణయాలు ఏవీ తీసుకోవడం లేదనే విమర్శలు కొనితెచ్చుకున్నారు. బీజేపీ ప్రభుత్వం విఫలమైందని మేధావులు చెబుతున్నారు.

అయితే బీజేపీ సర్కార్ ఫెయిల్యూర్ ను ప్రతిపక్ష కాంగ్రెస్ అందిపుచ్చుకోకపోవడం ఈ దేశ ప్రజల దౌర్భాగ్యంగా అని ఆ పార్టీ నేతలే నిట్టూరుస్తున్నారు. కాంగ్రెస్ బలంగా లేకుండా పోవడంతో ప్రజలు బీజేపీ కంటే కాంగ్రెస్ కావాలని మాట్లాడుకున్నా.. దాన్ని అందిపుచ్చుకోలేని నిస్సహాయతలో ఆ పార్టీ ఉంది. కాంగ్రెస్ పగ్గాలు మమతా బెనర్జీ లాంటి బలమైన నేత చేతుల్లో పెడితే ఆ పార్టీ మరింత బలంగా తయారయ్యేదన్న వాదన కూడా ఉంది. బీజేపీ కార్పొరేట్ పాలనతో విసిగి వేసారిన ప్రజలు ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ రావాలని చూస్తున్నారు. వారి నాయకత్వం బలపడితే అది సాధ్యమే.. చూడాలి మరీ ఏం జరుగుతుందో..