Begin typing your search above and press return to search.

కేటీఆర్ సీఎం కావాలని విపక్షాలు ఎందుకు కోరుకుంటున్నాయి?

By:  Tupaki Desk   |   14 Feb 2020 4:45 AM GMT
కేటీఆర్ సీఎం కావాలని విపక్షాలు ఎందుకు కోరుకుంటున్నాయి?
X


గత కొద్దిరోజులుగా తెలంగాణలో.. టీఆర్ఎస్ లో కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. మీడియా సైతం అదే వల్లెవేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలన్నీ కేటీఆర్ చుట్టూనే తిరుగుతున్నాయి. అయితే ఈ ప్రచారం నిజం కావాలనే ఆకాంక్ష విపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం కేసీఆర్ లాంటి రాజకీయ మేధావి తనం గల నాయకుడిని ఢీకొట్టే నేత ఏ పార్టీలోనూ లేడు. దీంతో కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తమ పని సులువు అవుతుందని కాంగ్రెస్ భావిస్తోందట.. అందుకే తమకు అనుకూలమైన మీడియా ద్వారా ప్రచారం సాగిస్తున్నట్టు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ లాంటి నేతను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ కేసీఆర్ అలాంటి నిర్ణయమే తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా కలిసి వస్తుందని నేతలు భావిస్తున్నారని సమాచారం.

*కాంగ్రెస్ టార్గెట్ కేటీఆర్..
ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ ను సీఎం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకెళ్లాలో ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. కేసీఆర్ లాంటి నేతను ఎదుర్కోవడం కాంగ్రెస్ పార్టీకి కష్టతరంగా మారింది. ప్రతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్, విపక్ష పార్టీల ఎత్తుగడలను కేసీఆర్ చిత్తు చేస్తూ ముందుకెళ్లారు. కేసీఆర్ డ్రైవింగ్ సీట్లో ఉండి జెట్ స్పీడుతో కారు పార్టీని ముందుకు నడిపించారు. అయితే కొద్దిరోజులుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కేటీఆర్ త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ బాహాటంగానే ప్రకటనలు చేస్తున్నారు. దీంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఈ ప్రచారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిన తర్వాత క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి తానే కొనసాగుతానని చెప్పాడు. అయినప్పటికీ కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడనే ప్రచారం ఆగడం లేదు. దీంతో కేసీఆర్ బాధ తప్పాలంటే.. తాము అధికారంలోకి రావాలంటే ప్రతిపక్ష పార్టీలు కూడా కేటీఆరే సీఎం కావాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రిగా కేటీఆర్ ఉంటే ఆయనను ఎదుర్కొవడం సులువు అవుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారని సమాచారం. కేటీఆర్ పదేపదే వారసత్వ రాజకీయంపై కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ లోని వారసత్వ రాజకీయాలపై ఓ రేంజ్లో రెచ్చిపోయారు. దీంతో కేటీఆర్ వారసత్వ కోటాలో ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ నేతలు ఆయనను ఎదుర్కోవడం తేలిక అవుతుందని భావిస్తున్నారు.

*బీజేపీకి కేటీఆరే కావాలి..
ఇక బీజేపీ సైతం తాము తెలంగాణలో పాగా వేయాలంటే కేసీఆర్ ఉంటే సాధ్యం కాదని లెక్కలేస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రంతో సాన్నిహిత్యంగా ఉంటూ బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిన సీట్లలో పోటికి చివరి నిమిషం వరకూ దిగకుండా చివర్లో టికెట్లు ఇచ్చి గెలిపించి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సహా అందరినీ కేసీఆర్ ఓడించాడు. ఆయన ఆలోచనలు, రాజకీయ వ్యూహాలను తట్టుకోవడం కష్టం అని నిర్ధారణకు వచ్చిన బీజేపీ కూడా కేటీఆర్ సీఎం కావాలని కోరుకుంటోందట.. ఈ మేరకు తమ సాన్నిహిత్యంగా ఉంటున్న మీడియాలో కేటీఆర్ సీఎం కావాలంటూ విస్తృతంగా కవరేజ్ కూడా ఇప్పిస్తుండడం విశేషం.

అయితే విపక్ష పార్టీలు కోరుకున్నట్లు కేసీఆర్ తన తనయుడి కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవీ కట్టబెడుతారా? లేదా అనేది చూడాల్సి ఉంది. అయితే విపక్ష నేతలను, సొంత పార్టీలోని కట్టడి చేసేందుకే కేసీఆర్.. కేటీఆర్ ముఖ్యమంత్రి అంటూ ప్రచారం చేయించారని మరికొందరు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మరీ కేటీఆర్ ముఖ్యమంత్రి అయితారా లేదా అనేది మాత్రం భవిష్యత్ లో తేలనుంది.