Begin typing your search above and press return to search.

డీకే అరుణ ఒక్కసారిగా స్పీడ్ పెంచడానికి కారణం అదేనా ?

By:  Tupaki Desk   |   21 Dec 2019 10:34 AM GMT
డీకే అరుణ ఒక్కసారిగా స్పీడ్ పెంచడానికి కారణం అదేనా ?
X
ఆమె కొన్ని రోజుల ముందు కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్నారు. ఆ తరువాత కాంగ్రెస్ లోని కొందరు నేతలతో ఏర్పడిన బేధాభిప్రాయాలతో కాంగ్రెస్ నుండి బయటకి వచ్చి బీజేపీ గూటికి చేరారు. బీజేపీలో చేరిన తరువాత, చాలారోజుల పాటు సైలెంట్‌గానే ఉంటూ వచ్చారు. అయితే, ఒక్కసారిగా స్పీడ్ పెంచి మహిళా సమస్యలపై పోరుబాట పట్టారు. గత కొన్ని రోజులుగా పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు సడెన్ గా కావడానికి కారణాలేంటన్న చర్చ, పార్టీలో జోరుగా సాగుతోంది.

ఉమ్మడి ఆంధప్రదేశ్ లో మంత్రిగా పని చేసిన డీకే అరుణ, రాష్ట్ర విభజన తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీలో చేరారు. అయితే పార్టీలో చేరిన తరువాత మహబూబ్ నగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేసిన ఆమె, ఓటమి పాలయ్యారు. ఆ తరువాత పార్టీలో పెద్దగా యాక్టివ్‌గా లేని అరుణ, దిశ ఘటన తరువాత మహిళా సమస్యలపై పోరు బాట పట్టి ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. దిశ కుటుంబ సభ్యులను పరామర్శించడమే కాకుండా, కోమరంభీమ్ అసిఫాబాద్ జిల్లాలో అత్యాచారం, హత్యకు గురైన సమత కుటుంబాన్ని మహిళా మోర్చా నాయకురాళ్లతో కలిసి పరామర్శించారు. దిశ, సమత, మానస హత్యలకు మద్యమే ప్రధాన కారణమన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, మహిళా మోర్చా ఆధ్వర్యంలో మద్యానికి వ్యతిరేకంగా దీక్ష చేశారు. ఈ దీక్ష సూపర్ సక్సెస్ అయ్యింది.

సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌ లో దిశ ఘటనను ఖండిస్తూ మహిళలపై పెరుగుతున్న నేరాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తరువాత మద్యపానాన్ని నిషేధిచాలంటూ డీకే రెండు రోజుల నిరాహారదీక్షతో వార్తల్లో నిలిచారు. ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించి అందరి దృష్టినీ ఆకర్షించారు. అయితే, నిన్నమొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న అరుణ ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిచడం వెనుక అసలు మతలబు ఏంటన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది.

పార్టీలో ప్రస్తుతం సంస్థాగత ఎన్నికలు జరుగుతున్న వేళ అటు పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగబోతోంది. ఈ సందర్భంలో అరుణ పార్టీలో యాక్టవ్ రోల్ పోషించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం అధ్యక్ష పదవి రేసులో ఉన్న వారిలో లక్ష్మణ్ తరువాత అరుణ పేరే బాగా బలంగా వినిపిస్తోంది . అందుకే అందరి దృష్టినీ తనవైపు తిప్పుకునేందుకే, హైదరాబాద్‌ కేంద్రంగా అరుణ ఆందోళనా కార్యక్రమాలు చేపడుతున్నారని కొందరు మాట్లాడుకుంటున్నారు. అలాగే అధ్యక్షుడిగా లక్ష్మణ్ ని కొనసాగించని నేపథ్యంలో అధ్యక్ష పీఠం డీకే అరుణకే దక్కనుందన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె గత కొన్ని రోజులుగా పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఈమె ప్రయత్నం ఎంతమేర సక్సెస్ అవుతుందో..