Begin typing your search above and press return to search.

వరదసాయంలో తెలంగాణపై వివక్ష ఎందుకు..? ఎమ్మెల్సీ కవిత

By:  Tupaki Desk   |   7 April 2022 9:45 AM GMT
వరదసాయంలో తెలంగాణపై వివక్ష ఎందుకు..? ఎమ్మెల్సీ కవిత
X
గత కొన్ని నెలలుగా కేంద్రంపై టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని, ఈ విషయంలో బీజేపీపై పోరాడాలని కేసీఆర్ పార్టీ నాయకులకు పిలపునిచ్చారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ ప్రముఖు కేంద్రంపై తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ కవిత కేంద్రం తీరుపై విరుచుకుపడ్డారు. అయితే ధాన్యం కొనుగోలుతో పాటు వరద సాయంలోనూ తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని అన్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

దేశ వ్యాప్తంగా వరదలు సంభవించినప్పుడు మిగతా రాష్ట్రాలకు సాయం అందించిన కేంద్రం తెలంగాణపై వివక్ష చూపించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 2021-22 సంవత్సరానికి కేంద్రం ఆయా రాష్ట్రాలకు ప్రకటించిన వరద సాయం రెండు రోజుల కింద నిధులను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ పేరు లేదని అన్నారు.

వరద సాయంలో తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు. అందుకు సంబంధించిన వరదసాయం లిస్టును ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. హైదరాబాద్లో వరదలతో అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారని, కానీ వారికి సాయం అందించడంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు.

హైదరాబాద్ లో వరదలు సంభవించినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక విధాలుగా ఆదుకుందన్నారు. బాధితులకు కేసీఆర్ అండగా ఉన్నారన్నారు. హైదరాబాద్ ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఏనాడు ఆదుకోలేదని, తెలంగాణపై కేంద్రానికి ఉన్న వివక్ష స్పష్టంగా తెలుస్తుందని తెలిపారు. వరద సాయం కింద తెలంగాణకు ఒక్క రూపాయి కూడా రాలేదని విమర్శించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం రూ.10 వేల చొప్పున బాధితులను ఆదుకుందని, తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్రానికి 1350 కోట్ల రూపాయల తక్షణ సాయం కావాలని ప్రదానిని కోరినప్పటికీ కేంద్రం స్పందించలేదన్నారు.

ఇక ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం తీరుపై ఎమ్మెల్సీ కవిత తప్పుబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ధాన్యం కొనుగోళ్లు శూన్యమన్నారు. తెలంగాణ రైతులకు కేంద్రం మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో వార్షిక క్యాలెండర్ ను ఏర్పాటు చేయాలన్నారు.

దాని ప్రకారమే రైతులు సాగు చేసే అవకాశం ఉందన్నారు. దేశవ్యాప్తంగా ధాన్యం సేకరణగా ఒకే విధంగా ఉండాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుంటుందని, కేంద్ర ప్రభుత్వం కూడా కలిసి రావాలని అన్నారు. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసి తీరాలన్నారు. కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతుందని విమర్శించారు.