Begin typing your search above and press return to search.

జగన్ సమీక్షకు ఆ ముఖ్య నేతలంతా ఎందుకు రానట్లు?

By:  Tupaki Desk   |   4 April 2023 10:08 AM GMT
జగన్ సమీక్షకు ఆ ముఖ్య నేతలంతా ఎందుకు రానట్లు?
X
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమానికి సంబంధించిన సమీక్షను నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. "రాజకీయాలంటే మానవ సంబంధాలు అని నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నా. నేను ఇంతగా ఎందుకు కష్టపడుతున్నాను? మిమ్మల్నిపిలిపించి ఇంతగా ఎందుకు చెబుతున్నానంటే కారణం.. మీతో పని చేయించి.. మిమ్మల్ని మళ్లీ గెలిపించాలనే ఈ అడుగులు వేస్తున్నాం.

మనం సరైన పద్దతుల్లో పని చేయక.. ప్రజల్లో మన గ్రాఫ్ సరి గా లేకపోతే పార్టీకి.. కేడర్ కు నష్టం. అందుకే గ్రాఫ్ పెంచుకోవాలి. లబ్థిదారుల ఖాతాలోకి నగదు నేరుగా వెళ్లేలా బటన్ నేను నొక్కుతాను. ప్రభుత్వ పథకాలు ప్రజల చెంతకు చేరేందుకు ప్రభుత్వం చేస్తున్న పనిని లబ్థిదారులకు నిత్యం చెప్పే బాధ్యతను మీరు తీసుకోండి. ఈ రెండు కలిస్తే 175 కు 175 స్థానాల్లో గెలుస్తాం" అని పేర్కొన్నారు.

భారీ అంచనాల మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమం మీద సాగిన అంచనాలకు తగ్గట్లే రివ్యూ సమావేశం సాగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిజగన్ చేసిన కీలక ప్రసంగం రోటీన్ కు భిన్నంగా సాగిందన్న మాట వినిపించింది. ఈ సమీక్షలో భాగంగా ప్రభుత్వ భవిష్యత్తు ప్రణాళిక పై మరింత అవగాహన కల్పించటంతో పాటు.. రానున్న రోజుల్లో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్ని వివరించారు.

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం ప్రజల మీద ఉండదన్న విషయాన్ని ఆయన గణాంకాల రూపంలో వివరించారు. విపక్షం గెలుచుకున్న నాలుగు ఎమ్మెల్సీ సీట్లు పెద్ద విషయం కాదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తేల్చేశారు. అయితే.. ఈ కీలక సమావేశానికి కొందరు ముఖ్యనేతలు గైర్హాజరు అయ్యారు.

ఇదే విషయం పై మీడియాలో భిన్న రిపోర్టులు వెల్లడయ్యాయి. ఇద్దరు మంత్రులు.. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు సమీక్ష కు రాని వైనం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ అధినేత.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ సమీక్ష కు రాని నేతల విషయానికి వస్తే.. మంత్రుల్లో ధర్మాన ప్రసాదరావు.. బుగ్గర రాజేంద్రనాథ రెడ్డి రాలేదు. ఎమ్మెల్యేల్లో ఆళ్ల రామక్రిష్ణారెడ్డి.. కొడాలి నాని.. వల్లభనేని వంశీలు దూరంగా ఉన్నారు.

అయితే.. వీరిలో పలువురికి అనారోగ్యం.. వ్యక్తిగత కారణాలతోనే హాజరుకాలేదని చెబుతున్నారు. సమావేశానికి రాని ఈ నేతలంతా ముందుస్తుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి సమాచారం అందించి.. ఆయన అనుమతితోనే రాలేదని అంటున్నారు. అయితే.. మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ భిన్నమైన ప్రచారం జరగటం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.