Begin typing your search above and press return to search.

రాజీనామాల తర్వాత ఆ ఇద్దరు మాజీలు హైదరాబాద్ కు ఎందుకు వెళ్లినట్లు?

By:  Tupaki Desk   |   9 April 2022 4:30 PM GMT
రాజీనామాల తర్వాత ఆ ఇద్దరు మాజీలు హైదరాబాద్ కు ఎందుకు వెళ్లినట్లు?
X
ముందే చెప్పినట్లు చేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ తన మంత్రుల నుంచి రాజీనామా పత్రాల్ని తీసుకోవటం.. వాటిపై ఆమోద ముద్ర వేయించటం.. కొత్త టీం కోసం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే..రాజీనామాల తర్వాత ఇద్దరు తాజా మాజీ మంత్రులు ఇంటికి కూడా వెళ్లకుండా హైదరాబాద్ కు నేరుగా వెళ్లిపోవటం చర్చనీయాంశంగా మారింది. పార్టీ తరఫున మాట్లాడే విషయంలో కానీ.. ప్రత్యర్థి పార్టీ నేతలపై అదే పనిగా విరుచుకుపడే ఈ ఇద్దరు నేతలు ఇంటికి వెళ్లకపోవటం విస్మయానికి గురి చేసింది.

పదవులకు రాజీనామా చేసిన మంత్రులకు సన్నిహితులు పరామర్శలుమొదలు పెట్టటం.. దీనికి సంబంధించిన ఇబ్బందుల్ని తప్పించుకోవటం కోసమే హైదరాబాద్ కు వెళ్లినట్లుగా కొందరు చెబుతుంటే.. ఇదేమీ కాదు.. తమకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితులపై గుర్రుగా ఉన్న వారు హైదరాబాద్ కు వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు.

తమ పదవులకు రాజీనామా చేసిన మంత్రులంతా 11న జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో.. హైదరాబాద్ కు వెళ్లిన ఇద్దరు నేతలు.. నేరుగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరవుతారని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. రాజీనామా చేసిన మంత్రుల్లో మరికొందరు బెంగళూరు వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు. వీరి తీరు పైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే.. కొత్త మంత్రివర్గంలో ఖాయంగా చోటు దక్కుతుందని ప్రచారం జరుగుతున్న ఒక మంత్రి సైతం రాజీనామా తర్వాత నుంచి దిగాలుగా కనిపించటం హాట్ టాపిక్ గా మారింది. చివరి మంత్రివర్గ సమావేశంలో చోటు చేసుకున్న కొన్ని అంశాలు కాస్త ఆలస్యంగా బయటకు వస్తున్నాయి.

కొత్త మంత్రివర్గంలో ఉంచితే తమ ఇద్దరిని ఉంచాలని.. లేకుంటే ఇద్దరిని తొలగించాలని ఒక మంత్రి మరో మంత్రి గురించి సీఎం జగన్ ముందు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఉదంతంలో రెండో మంత్రికి కొత్త కేబినెట్ లో చోటు లభిస్తుందన్న ప్రచారం బలంగా సాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవటం గమనార్హం.

మంత్రివర్గంలో అందరి ముందు ఓపెన్ కావటానికి మొహమాటపడని సదరు మాజీ మంత్రి రాజీనామాల తర్వాత బెంగళూరుకు వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. ఏమైనా.. రాజీనామాల ఎపిసోడ్ తర్వాత ఇళ్లకు వెళ్లకుండా బెంగళూరుకు వెళ్లిపోయిన వైనం ఆసక్తికర చర్చకు తెర తీసినట్లుగా చెబుతున్నారు.