Begin typing your search above and press return to search.

మంత్రి బొత్సకు ఆ పెద్దాయన 2 మార్కులే ఎందుకు వేశారు?

By:  Tupaki Desk   |   21 March 2023 12:00 PM GMT
మంత్రి బొత్సకు ఆ పెద్దాయన 2 మార్కులే ఎందుకు వేశారు?
X
'నేను అడిగిందేంటి? మీరు చెప్పేదేంటి? అసలు ఏమైనా అర్థముందా? అడిగిన ప్రశ్న కు సమాధానం చెప్పకుండా ఏదేదో చెప్పటమా? ఒక ఉపాధ్యాయుడిగా మీకు పది మార్కుల కు రెండు మార్కులు కూడా వేయలేను' అంటూ మంత్రి బొత్స సత్యానారాయణ పై ఫైర్ అయ్యారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రమణ్యం. తాజాగా ఏపీ మండలిలో జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సభలో అడిగిన ప్రశ్నల కు కచ్ఛితమైన సమాధానం రాదని.. వచ్చినా సరైన సమాచారాన్ని ఇవ్వరన్న అభిప్రాయాన్ని కలిగించొద్దంటూ క్లాస్ పీకారు.

ఇంతకీ ఇదంతా ఎందుకు జరిగిందంటే.. ఏపీ ప్రభుత్వాన్ని సూటిగా ఒక ప్రశ్న అడిగారు విఠపు బాలసుబ్రమణ్యం. ఆయన ప్రశ్నేమంటే.. '2019 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీల వివరాలు తెలపండి. నియమించిన ఉపాధ్యాయుల సంఖ్య చెప్పండి? ఉపాధ్యాయ ఖాళీల్నిభర్తీ చేసేందుకు కొత్త డీఎస్సీని ప్రకటించేందుకు ప్రభుత్వం వద్ద ఉన్న ప్రతిపాదన ఏమిటి? అంటూ ప్రశ్నించారు.

దీనికి సమాధానం ఇచ్చిన మంత్రి బొత్స బదులిస్తూ.. "2019లో డీఎస్సీ ద్వారా 14,219 పోస్టులు భర్తీ చేశాం. 2018, 1998లో నిర్వహించిన డీఎస్సీల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు పోస్టింగులు ఇస్తున్నాం. ఇంకా 771 పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నాయి. రిటైర్మెంట్ వయసును 62 ఏల్లకు పెంచటం వల్ల ఖాళీలు రాలేదు" అంటూ బదులిచ్చారు. దీంతో.. విఠపు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ.. సభ్యులు అడిగిన ప్రశ్నేమిటి? మంత్రి ఇచ్చిన సమాధానం ఏమిటి? ఈ ప్రశ్నకు ఎవరైనా విద్యార్థి ఇదే జవాబు రాస్తే పది మార్కుల కు రెండు మార్కులు కూడా నేను ఇవ్వను. ఉపాధ్యాయుడినికాబట్టి ఇలా చెబుతున్నా' అంటూ మండిపడ్డారు. ఎప్పుడో చేసిన నియామకాల గురించి ఇప్పుడు చెప్పటం ఏమిటి? అని సూటిగా ప్రశ్నించారు.

తాను అడిగే ప్రశ్నకు ఎప్పటి మాదిరి 'ఉంది.. లేదు.. ఉత్పన్నం కాదు' అంటూ ఏదో ఒకటి చెప్పాలన్న విఠపునోటి నుంచి మరింత ఆసక్తికర వ్యాఖ్య వచ్చింది. అది ఆయన మాటల్లో నే చదవాల్సిందే. అదేమంటే.. 'సభలో అడిగిన ప్రశ్న. మీరు చెప్పిన సమాధానం. రెండింటిని ఫోటో తీసి ఉపాధ్యాయుల వాట్సప్ గ్రూపులో పెడతా. విద్యా శాఖ ఇలాంటి సమాధానం చెప్పిందా?అని ఆశ్చర్యపోతారు. రేపటి నుంచి ఉపాధ్యాయులు కూడా ఇదే పద్దతిలో పిల్లలకు పాఠాలు చెప్పాలనుకుంటారు. సభలో వేసిన ప్రశ్నలకు కచ్ఛితమైన సమాధానం రాదు. వచ్చినా సరైన సమాచారం ఉండదన్న అభిప్రాయం కలిగించొద్దు" అంటూ ఒకరేంజ్ లో క్లాస్ పీకారు. దీంతో.. ఇబ్బంది పడిన బొత్స ప్రశ్నను అర్థం చేసుకోలేకపోవటంతోనే ఇలాంటి సమస్య వచ్చినట్లుగా పేర్కొంటూ సమాధానం ఇవ్వాల్సి వచ్చింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.