Begin typing your search above and press return to search.

ఎంపి ప్లాన్ ఎందుకు మార్చుకున్నారబ్బా ?

By:  Tupaki Desk   |   27 May 2021 7:30 AM GMT
ఎంపి ప్లాన్ ఎందుకు మార్చుకున్నారబ్బా ?
X
వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజు చివరి నిముషంలో ప్లాన్ మార్చుకున్నట్లే ఉన్నారు. సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్న ఎంపి హఠాత్తుగా మంగళవారం డిస్చార్జయి ఢిల్లీకి వెళ్ళిపోయారు. నిజానికి ఆయన మరో నాలుగు రోజులు ఆర్మీ ఆసుపత్రిలోనే ఉండాలి. ఎందుకంటే తనకు ఉన్న ఆనారోగ్యాన్ని వివరిస్తు మరో మూడు, నాలుగు రోజుల పాటు ఆసుపత్రిలోనే వైద్యం అందించాలంటు స్వయంగా ఆసుపత్రి ఉన్నతాధికారులకు లేఖ రాసిన విషయం తెలిసిందే.

తన బీపీలో బాగా హెచ్చుతగ్గులన్నాయని, నోరు పొడిబారిపోతోందని, కాళ్ళ నొప్పులుగా ఉందని, నిద్రసరిగా పట్టడం లేదంటు తన లేఖలో ఎంపి వివరించారు. పై లక్షణాలున్నాయి కాబట్టి తనకు మరో నాలుగు రోజులు ఆసుపత్రిలోనే వైద్యం అందించాలని ఎంపి రిక్వెస్టు చేసుకున్నారు. మరి ఆసుపత్రి ఉన్నతాధికారుల నుండి ఏమని సమాధానం వచ్చిందో తెలీదో. అయితే మరుసటిరోజే ఆర్మీ ఆసుపత్రి నుండి ఎంపి డిస్చార్జయి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళిపోవటం ఆశ్చర్యంగా ఉంది.

ప్రత్యేక చికిత్స కోసం ఎంపి ఢిల్లీకి వెళ్ళి నేరుగా ఎయిమ్స్ కు వెళ్ళారు. అయితే అక్కడ ఇన్ పేషంటుగా చేరే అవకాశం లేకపోవటంతో ఎంపి తనింటికి వెళ్ళిపోయారు. ఎయిమ్స్ మొత్తాన్ని ప్రస్తుతం కోవిడ్ సెంటర్ గా మార్చేసింది కేంద్రం ప్రభుత్వం. దాంతో నేరుగా ఆసపత్రికి వచ్చిన ఎంపిని చేర్చుకునే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. ప్రత్యేకంగా బెడ్ ఏర్పాటు చేసిన తర్వాత కబురు చేస్తామని ఎయిమ్స్ అధికారులు ఎంపికి చెప్పటంతో ఇంటికి వెళ్ళిపోయారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మరో నాలుగు రోజులు ఆర్మీ ఆసుపత్రిలోనే ఉండాలని అనుకున్న ఎంపి మరుసటిరోజే ఢిల్లీకి ఎందుకు వెళ్ళిపోయారనే విషయం సస్పెన్సుగా మారింది. ఆర్మీ ఆసుపత్రిలో తాను కోరుకున్నట్లుగానే వైద్యం అందుతోంది. మరలాంటపుడు అంత అత్యవసరంగా ఆర్మీ ఆసుపత్రి నుండి డిస్చార్జయి ఢిల్లీకి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందో ఎవరికీ అర్ధం కావటంలేదు.