Begin typing your search above and press return to search.

భారత్ క్షిపణి పాకిస్తాన్ లో ఎందుకు పడింది? తప్పు ఎవరిది?

By:  Tupaki Desk   |   12 March 2022 6:29 AM GMT
భారత్ క్షిపణి పాకిస్తాన్ లో ఎందుకు పడింది? తప్పు ఎవరిది?
X
దురదృష్టకర ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. భారత్ కు చెందిన క్షిపణి ఒకటి పాకిస్థాన్ భూభాగంలో కూలిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఉదంతంపై స్పందించిన భారత్.. తీవ్ర విచారణ వ్యక్తం చేస్తే..పాకిస్థాన్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతికాముక దేశంగా పేరున్న భారత్.. ఎప్పుడూ ఏ దేశంతోనూ తనకు తానుగా గిల్లి కజ్జాలు పెట్టుకోదున్న సంగతి తెలిసిందే. తాజా ఉదంతాన్ని చూస్తే.. సాంకేతికంగా జరిగిన తప్పుతోనే ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుందన్న మాట వినిపిస్తోంది. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతానికి సంబంధించిన విశేషాల్ని చూస్తే..

మార్చి 9న సాయంత్రం 6.43 గంటల వేళలో భారత్ లోని సూరత్ గఢ్ నుంచి సూపర్ సోనిక్ వేగంతో వస్తువు ఒకటి పాక్ గగనతలంలోకి దూసుకొచ్చి.. అదే రోజు సాయంత్రం 6.50 గంటల వేళలో పంజాబ్ ప్రావిన్స్ లోని ఖానేవాల్ జిల్లా పరిధి మియాన్ చున్ను నగరం సమీపంలో కూలింది. దీని కారణంగా పౌరులు ఎవరు మరణించకున్నా.. ఆస్తి నష్టం వాటిల్లింది. దీనిపై పాకిస్థాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ ఉదంతంపై భారత్ బాధ్యతాయుతంగా స్పందించింది. పాకిస్థాన్ ఆందోళనపై భారత్ వెంటనే స్పందించింది. క్షిపణుల రోజువారీ నిర్వహణ సమయంలో జరిగిన పొరపాటు.. తలెత్తిన సాంకేతిక లోపంతోనే.. గగనతల పరిధుల్ని దాటి వచ్చినట్లుగా భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇదే విషయాన్ని పాక్ అధికారులు చెబుతూ.. వేగంగా దూసుకొస్తున్న వస్తువును తమ ఎయిర్ డిఫెన్సు విభాగం పసిగట్టిందని.. భూమికి 40 వేల అడుగుల ఎత్తులో 3.44 నిమిషాల వ్యవధిలో 124 కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం కూలినట్లుగా పేర్కొన్నారు.

తాజా ఉదంతంపై భారత్ స్పందిస్తూ.. కూలిన ఘటనపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ.. ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లుగా ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఈ ఉదంతం నేపథ్యంలో ఇస్లామాబాద్ లోని పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం మన దౌత్యాధికారిని గురువారం రాత్రి పిలిపించుకొని.. తీవ్ర నిరసనను తెలిపింది.

పారదర్శకమైన దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది. ఇదిలా ఉంటే.. భారత క్షిపణి ప్రయాణించిన మార్గంపై పాకిస్థాన్ విడుదల చేసిన మ్యాప్ తో.. ఆ దేశానికి ఉన్న సాంకేతిక వ్యవస్థ ఏమిటన్న విషయంపై కాసింత క్లారిటీ వచ్చిందని చెప్పాలి.

క్షిపణి గమనాన్ని పసిగట్టిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ చైనా తయారీ హెచ్ క్యూ 9/పి హిమద్స్ కావచ్చంటున్నారు.ఆ సాంకేతిక వ్యవస్థను పాకిస్తాన్ కు చైనా గత ఏడాది అక్టోబరులో అందించినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా జరిగిన పొరపాటు కారణంగా.. పాకిస్థాన్ కు ఉన్న సాంకేతిక వ్యవస్థ ఏపాటిదన్న విషయం అర్థమైందని చెప్పక తప్పదు.