Begin typing your search above and press return to search.

నిమ్మగడ్డ మీటింగ్ కు ఏపీ అధికారపక్షం ఎందుకు వెళ్లట్లేదు?

By:  Tupaki Desk   |   28 Oct 2020 4:30 AM GMT
నిమ్మగడ్డ మీటింగ్ కు ఏపీ అధికారపక్షం ఎందుకు వెళ్లట్లేదు?
X
కీలక నిర్ణయాన్ని తీసుకుంది ఏపీ అధికారపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నిర్వహిస్తున్న భేటీకి తమ తరఫున ఎవరూ పాల్గొనకూడదని నిర్ణయించారు. స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంపై ఈ రోజు రాజకీయ పార్టీలతో భేటీ నిర్వహిస్తున్నారు. ఇలాంటి వేళ.. అధికారపక్షం సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించటం ఆసక్తికరంగా మారింది.

అధికార పార్టీనే ఎన్నికల సంఘం కమిషనర్ నిర్వహించే సమావేశానికి హాజరు కాకపోవటమే కాదు.. ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్న తీరుపైనా అభ్యంతరాల్ని వ్యక్తం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో సుప్రీం ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా వ్యవహరిస్తున్న తీరును తప్పు పడుతూ అధికార పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఒకసారి ఆగిన ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలంటే.. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాల్ని తీసుకొని.. ఆ ప్రకారం ముందుకు వెళ్లాలని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణపైన రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తీసుకోకుండా.. చీఫ్ సెక్రటరీ.. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఇచ్చే అభిప్రాయాలతో సంబంధం లేకుండా రాజకీయ పార్టీలతో సమావేశాన్ని నిర్వహిస్తున్న తీరును చూస్తే.. వేరే ఉద్దేశాలు ఉన్నట్లుగా అర్థమవుతుందని చెబుతున్నరు.

రాష్ట్రంలో మూడు కోవిడ్ కేసులు కూడా లేని వేళలో.. ఎవరిని అడిగి నిమ్మగడ్డ ఎన్నికల్ని వాయిదా వేశారు? ఈ రోజున రోజుకు మూడు వేల కేసులు నమోదువుతున్నవేళ..ఒకసారి కోవిడ్ సోకిన వారికి మరోసారి కూడా కోవిడ్ వస్తున్న వేళలో ఎన్నికల్ని నిర్వహించొచ్చా? అని అంబటి ప్రశ్నిస్తున్నారు.

తనకు ప్రాణభయం ఉందని.. తమ పార్టీది ఫ్యాక్షనిస్టు ధోరణి అని.. గూండాలమని.. సంఘ వ్యతిరేక శక్తులమని లేఖలు రాసిన చరిత్ర నిమ్మగడ్డని.. అలాంటి ద్వేషం.. వ్యతిరేక భావం ఉన్న వ్యక్తి ఈ రోజున ఒక్కో పార్టీకి పది నిమిషాలు చొప్పున వేర్వేరుగా సమావేశాన్ని నిర్వహించటాన్ని తమ పార్టీ రిజెక్టు చేస్తుందని అంబటి చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. నిమ్మగడ్డ తీరుపై గుర్రుగా ఉందన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేందుకు సైతం ఏపీ అధికారపక్షం వెనుకాడలేదు. అధికారపక్షం లేకుండా నిర్వహించే సమావేశాలకు ఉండే విలువ ఎంతన్నది ఇప్పుడు ప్రశ్న.