Begin typing your search above and press return to search.

పెనుగొండ లో టీడీపీ ఎందుకు ఓడిపోయింది ?

By:  Tupaki Desk   |   2 Jan 2022 5:29 AM GMT
పెనుగొండ లో టీడీపీ ఎందుకు ఓడిపోయింది ?
X
ఈ విషయమే చంద్రబాబునాయుడుకు ఇంకా అర్ధం కాలేదట. చేసిన పనులను ప్రచారం చేసుకోలేకపోవటం వల్లే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిందనే వాదనను చంద్రబాబునాయుడు తిరస్కరించారు. కొత్త సంవత్సరం సందర్భంగా పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతు మొన్నటి ఎన్నికల్లో ప్రజలు టీడీపీని ఘోరంగా ఎందుకు ఓడించారో అర్ధం కావటంలేదంటు తెగ బాధపడిపోయారు. ఇదే మాటను చంద్రబాబు మొదటి నుండి చెబుతున్నారు.

జరిగిన అభివృద్ధి కళ్ళముందే కనిపిస్తున్నా ప్రజలు ఎందుకు ఓట్లేయలేదని అడుగుతు పెనుగొండలో కియా పరిశ్రమను ఉదాహరణగా చూపించటమే విచిత్రం. మరి పెనుగొండలో కియా పరిశ్రమ వచ్చినా జనాలు పెనుగొండలో కూడా ఎందుకు ఓడగొట్టారు ? ఎందుకంటే క్షేత్రస్ధాయిలో జరిగిన మోసానికి చంద్రబాబే కారణం కాబట్టి. పరిశ్రమ పేరుతో వేలాది ఎకరాల వ్యవసాయ భూములను సమీకరించారు. పరిశ్రమ ఏర్పాటు సందర్భంగా స్ధానికులకే ఉద్యోగాలు ఇస్తామని రైతులకు హామీ కూడా ఇచ్చారు.

పరిశ్రమ ఏర్పాటును చూసి అందులో అవసరమైన ఎలక్ట్రికల్, ఫిట్టర్, మెకానికల్ లాంటి కోర్టుల్లో యువత ఐఐటి, పాలిటెక్నిక్ చదివారు. అలాగే సాఫ్ట్ వేర్ కోర్సులు కూడా చేశారు. కానీ చివరకు జరిగిందేమిటి ? స్ధానికుల్లో ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. చెన్నైలోని ప్లాంటు నుండి అవసరమైన ఉద్యోగులను యాజమాన్యం తెప్పించుకుంది. స్ధానికులను కేవలం సెక్యూరిటి, శానిటేషన్ లాంటి ఉద్యోగాల్లో మాత్రమే నియమించింది.

ఇదే విషయాన్ని యాజమాన్యంతో రైతులు ప్రస్తావిస్తే సమాధనం చెప్పలేదు. దాంతో గొడవలు అయ్యాయి. తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని అంటేనే భూములు ఇచ్చామని రైతులు నెత్తినోరు మొత్తుకున్నారు. అయినా యాజమాన్యం పట్టించుకోకపోవటంతో తమ భూములను వెనక్కు ఇచ్చేయాలని గొడవలకు దిగారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి రైతులను, వారి పిల్లలను అరెస్టు చేసి కేసులు పెట్టారు.

మొత్తం మీద నష్టపోయింది రైతులు, మామూలు జనాలు. అందుకనే ఎన్నికలు వచ్చేంతవరకు ఏమీ చేయలేక తమ కోపాన్ని పోలింగ్ సమయంలో చూపించారు. దాంతోనే టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇలాంటి కారణాలతోనే రాజధాని నియోజకవర్గాలైన తాడేపల్లి, మంగళగిరిలో కూడా ఓడిపోయింది. ఓటమికి కారణాలు ఇంత స్పష్టంగా కళ్ళకు కనబడుతుంటే ఎందుకు ఓడిపోయామో తెలీటం లేదని చంద్రబాబు అనుకుంటున్నారంటే తనను తాను మోసం చేసుకుంటున్నట్లే లెక్క.