Begin typing your search above and press return to search.

లోటస్ పాండ్ కు రావాలని షర్మిల ఎందుకు కోరారంటే?

By:  Tupaki Desk   |   9 Feb 2021 4:37 AM GMT
లోటస్ పాండ్ కు రావాలని షర్మిల ఎందుకు కోరారంటే?
X
మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. ఎప్పుడైనా.. ఏమైనా జరిగే అవకాశం రాజకీయ రంగంలోనే ఉంటుంది. ఈ రంగంలో శాశ్విత శత్రువులు.. శాశ్విత మిత్రులు ఉండరన్న నానుడి తరచూ వినిపిస్తూ ఉంటుంది. అందుకు తగ్గట్లే చోటు చేసుకునే పరిణామాలు ఉంటాయి. తాజాగా అలాంటి అంశమే ఒకటి వినిపిస్తోంది. దివంగత మహానేత వైఎస్ కుమార్తె షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టనుందన్న మాట కొద్దిరోజులుగా వినిపిస్తోంది.

ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన లేనప్పటికి.. అనధికారికంగా తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన వారికి పంపిన ఆహ్వానం ఆసక్తికరంగా మారింది. ఎక్కడిదాకానో ఎందుకు.. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఈ రోజు (మంగళవారం) హైదరాబాద్ లో జరిగే ఆత్మీయ సమ్మేళానికి రావాలని కోరినట్లుగా తెలుస్తోంది. వైఎస్ కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న వారినే పిలిచినట్లుగా చెబుతున్నారు.

నల్గొండ జిల్లాకు చెందిన టీటీడీ సలహా సంఘం సభ్యుడు.. తొలి నుంచి వైఎస్ కుటుంబానికి వీర విధేయుడైన పిట్టా రాంరెడ్డి ఆధ్వర్యంలో జనసమీకరణ జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. మంగళవారం ఉదయం 10.30 నుంచి 11.30 మధ్యన ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన 150 మంది ముఖ్య కార్యకర్తలతో షర్మిల తొలి భేటీ సాగనుంది. ఇంతకీ ఈ భేటీకి షర్మిల పంపిన ఆహ్వానం ఏమిటి? అన్నది చూస్తే.. ఆసక్తికర సమాధానం లభిస్తుంది.

ఈ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పెళ్లి రోజు కావటంతో.. ఆత్మీయ సమ్మేళనానికి రావాలన్న ఆహ్వానం పంపినట్లుగా చెబుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు దాదాపు 3 వేల మంది వరకు హాజరవుతారని చెబుతున్నారు. మరికొన్ని జిల్లాల నుంచి ఇదే తీరులో పలువురు నేతలు లోటస్ పాండ్ కు వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది.