Begin typing your search above and press return to search.

పవన్ సభలో జగన్ ప్రసంగం.. అదెలా సాధ్యం?

By:  Tupaki Desk   |   10 Jan 2021 3:41 AM GMT
పవన్ సభలో జగన్ ప్రసంగం.. అదెలా సాధ్యం?
X
రోటీన్ కు భిన్నంగా వ్యవహరించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇప్పటివరకు మరే రాజకీయ నేత చేయని రీతిలో వ్యవహరించిన పవన్ కల్యాణ్.. కొత్త తరహా అనుభూతిని ఇచ్చారు. అదే సమయంలో అధికారపక్షానికి ఊహించని షాకిచ్చారు. సిద్ధాంతాలతోనే రాజకీయాలు చేస్తానని.. తాను కులం.. కుటుంబ రాజకీయాల్ని చేయనని మాటిచ్చారు. దివీస్ సంస్థ ఏర్పాటు చేస్తున్న పరిశ్రమపై ప్రజల్లో వెల్లువెత్తుతున్న సందేహాలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు పవన్ కల్యాణ్.

కాలుష్య పరిశ్రమలపై తనకు స్పష్టమైన అవగామన ఉందన్న పవన్ కల్యాణ్.. తూర్పుగోదావరి జిల్లా తుని అసెంబ్లీ నియోజకవర్గంలోని వలసపాకలో దివీస్ పరిశ్రమ ఏర్పాటును నిరసిస్తూ ఏర్పాటు చేసిన ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధితుల్ని పరామర్శించి భరోసా ఇచ్చారు. ప్రభుత్వ విధానాలు సరిగా లేనప్పుడే ప్రశ్నిస్తామని చెప్పిన పవన్.. దివీస్ సంస్థపై ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రసంగాన్ని తన సభలో ప్లే చేశారు.

అందులో తాము దివీస్ సంస్థను అనుమతించమన్న మాట ఉంది. జగన్ మాటల్ని ప్లే చేసిన అనంతరం.. పవన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తన మాటల్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు దివీస్ కు అనుమతులు ఇవ్వనని చెప్పారంటూ వీడియోను ప్రదర్శించి మరీ ఇరుకున పెట్టారు. అనేక మంది నుంచి వేల ఎకరాలు తీసుకొని దివీస్ పరిశ్రమకు 690 ఎకరాలు ఇచ్చారన్నారు. దీంతో వచ్చిన ఉద్యోగాలు 1500 మాత్రమేనని.. కాలుష్య పరిశ్రమల్ని తీసుకొస్తే.. ప్రజలు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు.

దేశంలో పర్యావరణ చట్టాలు బలహీనంగా ఉన్నాయని.. ఇంత కాలుష్యం వెదజల్లుతుంటే పొల్యుషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాలుష్యం కారణంగా వచ్చే వ్యాధులకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రవ్నించారు. వ్యాధులు లేని సమాజాన్ని కోరుకుంటున్నామని.. కాలుష్యం వెదజల్లే పరిశ్రమల్ని రానివ్వబోమని విపక్ష నేతగా ఉన్నప్పుడుజగన్ చెప్పారన్నారు. దివీస్ పరిశ్రమ కారణంగా విపరీతమైన కాలుష్యం వస్తోందని.. కాలుష్య జలాలు రావని దివిస్ యాజమన్యాం హామీ ఇస్తారా? అని ప్రశ్నించారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. తన సభలో తన ప్రత్యర్థి పార్టీ అధినేత ప్రసంగాన్ని ప్లే చేసి చూపించిన వైనం.. కొత్త తరహా రాజకీయానికి తెర తీసినట్లుగా చెప్పక తప్పదు.