Begin typing your search above and press return to search.

బీజేపీ ముఖ్యమంత్రిని కేసీఆర్ రహస్యంగా కలిశారా?

By:  Tupaki Desk   |   1 Jan 2021 10:56 AM GMT
బీజేపీ ముఖ్యమంత్రిని కేసీఆర్ రహస్యంగా కలిశారా?
X
సంచలనం అంశం ఒకటి బయటకు వచ్చింది. కేంద్రంలోని మోడీ సర్కారు మీద పోరాడతామని.. అందుకు హైదరాబాద్ వేదిక అవుతుందని.. దానికి తానే సారథిగా వ్యవహరిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇటీవల కాలంలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన వ్యక్తిగత పని మీద హైదరాబాద్ కు వచ్చిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను సీఎం కేసీఆర్ రహస్యంగా భేటీ కావటం సంచలనంగా మారింది. ప్రగతిభవన్ కు కూతవేటు దూరంలో ఉన్న ఒక ఫైర్ స్టార్ హోటల్ లో ఉన్న ఆయన్ను సీఎం కేసీఆర్ భేటీ అయినట్లుగా చెబుతున్నారు.

ఈ సందర్భంగా వారిద్దరిమధ్య తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిగినట్లుగా చెబుతున్నారు. ఇదే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి ఉండగా.. వారి స్థానే బీజేపీ అధికారపగ్గాలు చేపట్టటం.. అందుకు తగ్గట్లుగా కొన్ని రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. అలాంటి సీఎం శివరాజ్ సింగ్ తో కేసీఆర్ రహస్య సమావేశం ఇప్పుడు పలు వాదనలకు తెర తీస్తోంది.

దుబ్బాకలో ఓటమి.. తర్వాత గ్రేటర్ ఎన్నికల్లోనూ దెబ్బ పడిన నేపథ్యంలో కేసీఆర్ పలు అంశాల్లో తగ్గటం తెలిసిందే. అదే సమయంలో.. కేంద్రంలోని మోడీ సర్కారుతో పెట్టుకోవటం కన్నా..రాజీ మార్గంలో పయనించాలన్న యోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా బీజేపీ ముఖ్యమంత్రితో భేటీ ద్వారా.. ఆయన సరికొత్త రాయబారాన్ని నడుపుతున్నారా? అన్నది ప్రశ్నగా మారింది.

అయితే.. అలాంటిదేమీ లేదని.. ఒకవేళ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ భేటీ జరిగితే.. అది మర్యాదపూర్వక భేటీనే తప్పించి.. మరింకేమీ ఉండదని చెబుతున్నారు. ఒకవేళ.. ఆ వాదనే నిజమైతే.. అధికారికంగానే కలవొచ్చు. అలా కాకుండా.. రహస్యంగా ఎందుకు కలుస్తారు? అన్నది ప్రశ్నగా మారింది. ఏమైనా.. బీజేపీ ముఖ్యమంత్రితో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కావటం సంచలనంగా మాత్రమే కాదు..రాజకీయంగా పలు పరిణామాల మార్పునకు నాందిగా అభివర్ణిస్తున్నారు.