Begin typing your search above and press return to search.

కోట్లాట వేళలో.. దేవుడి ప్రస్తావనను కేసీఆర్ ఎందుకు తెచ్చారు?

By:  Tupaki Desk   |   2 Oct 2020 5:30 PM GMT
కోట్లాట వేళలో.. దేవుడి ప్రస్తావనను కేసీఆర్ ఎందుకు తెచ్చారు?
X
సీన్లోకి దేవుడ్ని తీసుకొచ్చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నున్న విభజన పంచాయితీల లెక్క ఇప్పుడే కాదు.. మరో పదేళ్లకు సైతం తేలదన్నది వాస్తవం. మరి.. ఆరో తేదీన జరిగే అపెక్సు కౌన్సిల్ లో రాష్ట్రం తరఫున బలమైన వాదనల్ని వినిపించాలని ఆదేశించిన కేసీఆర్.. తాజాగా తెలంగాణ ప్రయోజనాల కోసం దేవుడితో నైనా కయ్యం పెట్టుకోవటానికి సిద్ధమన్న సంచలన వ్యాఖ్య చేశారు. ఎందుకిలా చేస్తున్నట్లు? ఆయన లెక్క ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

సమయం.. సందర్భాన్ని తనకు తగినట్లుగా మలుచుకోవటం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. మరో రెండు మూడు నెలల్లో వరుస ఎన్నికలు తెలంగాణలో జరుగుతున్నాయి. అలాంటివేళ.. ప్రభుత్వంపై సాధారణంగా ఉండే వ్యతిరేకత.. అసంతృప్తి లాంటివి గుర్తుకు రాకుండా ఉండాలంటే.. ఏదో ఒక భావోద్వేగ అంశం అవసరం. తన అమ్ములపొదిలో సిద్ధంగా ఉంటే.. భావోద్వేగ అస్త్రాన్ని బయటకు తీయటంలో కేసీఆర్ నేర్పు ఎంత చెప్పినా తక్కువే.

తాజాగా అలాంటి వ్యూహాన్నే మరోసారి తెర మీదకు తీసుకొచ్చారు కేసీఆర్. ఓవైపు జీహెచ్ఎంసీ ఎన్నికలు.. మరోవైపు పట్టభద్రుల ఎన్నిక.. ఇంకోవైపు వరంగల్.. నిజామాబాద్ కార్పొరేషన్లతో పాటు.. దబ్బాక ఉప ఎన్నిక.. ఇలా వరుస ఎన్నికల వేళ.. రైతులు.. వ్యవసాయం లాంటి అంశాలు గుర్తుకు రావటంతో పాటు.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే పంచాయితీల్ని తనకు అనుకూలంగా మార్చుకోవటంలో కేసీఆర్ నేర్పు ఎంతలా ఉంటుందని చెప్పటానికి ఆయన తాజా మాటలే నిదర్శనంగా చెప్పాలి.

సోదర రాష్ట్రంలో నెలకొన్న వివాదాల్ని కూర్చొని సెటిల్ చేసుకుంతే సెట్ అయ్యే ఛాన్సులే ఎక్కువ. అందునా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య అనుబంధం కూడా ఎక్కువే. అయినప్పటికీ రాష్ట్రాల మధ్య ఉన్న లొల్లి విషయంలో తేల్చే కంటే కూడా.. తాను తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎంత కటువుగా ఉంటానన్న విషయాన్ని కేసీఆర్ చెప్పే ప్రయత్నం చేయటం వెనుక వ్యూహం.. తాజాగా దగ్గరకు వచ్చిన ఎన్నికలే అని చెప్పక తప్పదు. మరీ.. భావోద్వేగ అస్త్రాలకు తెలంగాణ ఓటర్లు ఏ మేరకు ఓట్లు రాలుస్తారన్నది రానున్న కొద్ది రోజుల్లో మరింత క్లారిటీ వస్తుందని చెప్పక తప్పదు.