Begin typing your search above and press return to search.

ఆంధ్రభూమి ఉద్యోగులు మానవ హక్కుల కమిషన్ ను ఎందుకు కలిశారు?

By:  Tupaki Desk   |   6 March 2021 6:22 AM GMT
ఆంధ్రభూమి ఉద్యోగులు మానవ హక్కుల కమిషన్ ను ఎందుకు కలిశారు?
X
కాపాడాల్సిన కనురెప్పలే కాటేస్తే.. సమాజంలోని సమస్యల గురించి.. వాటి పరిష్కారం కోసం ప్రయత్నించాల్సిన మీడియా సంస్థలే.. సమస్యగా మారితే ఎలా ఉంటుంది? గతంలో సమాజం కోసం.. దాని శ్రేయస్సు కోసం ఫ్యాషన్ తో పత్రికల్ని నడిపేవారు. మారిన కాలానికి తగినట్లుగా.. మీడియా సంస్థలు సైతం వాణిజ్య సంస్థలుగా రూపాంతరం చెందుతున్నాయన్న విమర్శలకు బలం చేకూరే పరిణామాలు ఇటీవల కాలంలో చాలానే జరిగాయి. తాజాగా ఆంధ్రభూమి మీడియా సంస్థలో పని చేసే ఉద్యోగుల కష్టాలు.. కడగండ్లను చూస్తే.. అయ్యో అనుకోకుండా ఉండలేం. అంతేకాదు.. వారి వేదన ఆరణ్యరోదనలా మారిపోవటంతో చివరకు వారు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు.

కరోనా పేరుతో ఏడాదిగా పత్రికను మూసేశారని.. దీంతో తాము తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నట్లుగా వారు చెబుతున్నారు. ఏడాదిగా యాజమాన్యం జీతాలు చెల్లించకపోవటంతో.. తమ జీవనోపాధి కోల్పోయామని.. తమ కుటుంబాలు రోడ్డున పడినట్లుగా వారు వాపోతున్నారు. అద్దెలు కట్టలేక.. పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేక.. వైద్య ఖర్చులకు డబ్బులు లేక పడరాని పాట్లు పడుతున్నట్లుగా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్థిక కష్టాలు భరించలేక ఇప్పటికే సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని.. తమకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. తమ న్యాయమైన సమస్యల్ని పరిష్కరించటంలో యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై తాజాగా ఆ మీడియా సంస్థకు చెందిన ఉద్యోగులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ చంద్రయ్యను కలుసుకొని వేడుకున్నారు. కోవిడ్ సాకుతో ఆంధ్రభూమి యాజమాన్యం ఏడాదిగా ప్రచురణను నిలిపివేయటంతో పాటు.. ఉద్యోగులకు జీతాలు చెల్లించటం లేదన్నారు. దీంతో.. రిటైర్డుఉద్యోగులు.. కాంట్రాక్టు ఉద్యోగులకు తీరని అన్యాయానికి గురి చేస్తున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి.. వీరి కష్టాలు ఎప్పటికి తీరతాయో?