Begin typing your search above and press return to search.

అవంతికి అమృత ఎందుకు ఫోన్ చేశారు? ఆ ఇద్దరు ఏమనుకున్నారు?

By:  Tupaki Desk   |   15 Oct 2020 7:15 AM GMT
అవంతికి అమృత ఎందుకు ఫోన్ చేశారు? ఆ ఇద్దరు ఏమనుకున్నారు?
X
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి అమృత-ప్రణయ్.. అవంతి-హేమంత్ ఉదంతాలు. ఈ ఇద్దరు అమ్మాయిలు చేసింది ఏమైనా ఉందంటే.. అది ఇంట్లో వారిని కాదని తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకోవటమే. దీనికే వీరు ప్రాణంగా ప్రేమించిన వారిని చంపేసిన దారుణం షాకునివ్వటమే కాదు.. మరీ ఇంత దారుణమా? అన్న ప్రశ్నను తెర మీదకు తీసుకొచ్చింది. ఈ మధ్యనే హైదరాబాద్ లోని అవంతి ప్రేమను జీర్ణించుకోలేని ఆమె తల్లిదండ్రులు.. కుమార్తె పెళ్లాడిన యువకుడ్ని అత్యంత దారుణంగా.. క్రూరంగా చంపేయించారు.

అవంతితో ఒక మీడియా సంస్థ తాజాగా మాట్లాడింది.ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా అవంతి ఒక ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. మిర్యాలగూడకు చెందిన అమృత తనతో ఫోన్ లో మాట్లాడారని చెప్పారు. పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే.. చంపేస్తారా? అన్న ప్రశ్నతో పాటు.. ప్రేమించుకొని పెళ్లి చేసుకోవటం తప్పెలా ఉంటుందన్నది వారి వాదన. అంతేకాదు.. పరువు హత్యల్ని నిరోధించే ప్రత్యేక చట్టం కోసం అమృతతో కలిసి తాను ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అవంతి తెలిపింది.

తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం రెండు.. మూడు వేల మందికే తెలుసని.. కానీతన తల్లిదండ్రులు చేసిన పనికి దేశమంతా మాట్లాడుకుంటుందన్నారు. తన జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ తనకు లేదా? అని ప్రశ్నిస్తున్న ఆమె.. ప్రేమపెళ్లి నేరం ఎందుకు అవుతుంది? సూటిగా ప్రశ్నిస్తున్నారు. తనకు ఇంత జరిగినా.. తమ ప్రాంత ఎమ్మెల్యే కానీ.. తమ కార్పొరేటర్ కానీ పరామర్శిస్తారని అనుకున్నానని.. కానీ అలా జరగలేదన్నారు. తమ ఎమ్మెల్యే తన తండ్రికి చాలా సన్నిహితులని.. తమ ఇంట్లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారని.. అలాంటి ఆయన.. తనకు జరిగిన దాని గురించి మాత్రం మాట్లాడలేదని.. తనకు ధైర్యం చెప్పలేదని వ్యాఖ్యానించారు. తన మేనమామకు అప్పులున్నాయని.. వాటిని తీర్చేస్తారన్న ఉద్దేశంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లుగా అవంతి పేర్కొన్నారు. ఇప్పుడు ఆమె మాటలు సంచలనంగా మారాయి.