Begin typing your search above and press return to search.

మూడుచింతలపల్లిలోనే ధరణి పోర్టల్ ఎందుకు ప్రారంభించారు?

By:  Tupaki Desk   |   30 Oct 2020 7:50 AM GMT
మూడుచింతలపల్లిలోనే ధరణి పోర్టల్ ఎందుకు ప్రారంభించారు?
X
దేశానికే దిక్సూచిగా పేర్కొంటూ.. భూరిజిస్ట్రేషన్ల విధానంలో కొత్త సంస్కరణలు తీసుకొస్తూ.. మరెక్కడా లేని కొత్త విధానానని ధరణి వెబ్ సైట్ ద్వారా షురూ చేయటం తెలిసిందే. ధరణి వెబ్ పోర్టల్ ను మూడుచింతలపల్లిలో స్టార్ట్ చేయటం వెనుక అసలు కారణాల్ని వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఒక విప్లవానికి కారణమైన ఈ గ్రామం ధరణి వెబ్ పోర్టల్ ప్రారంభంతోచరిత్రాత్మక ఘట్టానికి వేదికగా మారిందని ఆయన చెప్పారు.

1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వీరారెడ్డిది ఇదే గ్రామమని.. ఆయన్ను గౌరవించుకోవాలన్న ఉద్దేశంతోనే ధరణి పోర్టల్ ను ఈ గ్రామంలో స్టార్ట్ చేసినట్లు కేసీఆర్ వెల్లడించారు. ‘‘తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడి జైలు పాలైన వ్యక్తుల్లో వీరారెడ్డి ఒకరు. ఆయన పోరాటానికి గుర్తుగా ధరణి వెబ్ పోర్టల్ ను ఈ గ్రామంలోనే ప్రారంభించాం. ఆయన చేసిన పోరాటానికి సముచితమైన గౌరవాన్ని అందించాలనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

కొత్తగా తీసుకొచ్చిన రెవెన్యూ చట్టంలో కిరికిరిగాళ్లను దృష్టిలో పెట్టుకొని కొన్ని నిబంధనల్ని పెట్టినట్లుగా కేసీఆర్ చెప్పారు. భూమి అమ్మకం.. కొనుగోలు జరిగిన భూమి మార్పిడి ఉంటుందని. అందుకు భిన్నంగా కుటుంబ పెద్ద చనిపోతే.. వారసత్వంగా వచ్చిన భూమి పిల్లలపేరు మీదకు మారే ఫౌతీ విధానంలో కుటుంబానికే అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులంతా మాట్లాడుకొని.. తీర్మానం చేసుకొని.. సంతకాలు పెట్టి స్లాట్ అడిగితే ఎమ్మార్వో వారికి స్లాట్ కేటాయిస్తారన్నారు. అప్పుడే వారసత్వ సంపద కుటుంబం పేరుతో రిజిస్టర్ అవుతుందన్నారు.

అయినా.. కొంతమంది కిరికిరిగాళ్లు పెట్టే పంచాయితీల వల్ల ఎటూ తెగని కేసులు ఉంటాయని.. వాటిని తేల్చుకోవటానికి కోర్టుకు వెళ్లమని చెబుతామన్నారు. కోర్టు తీప్పు ప్రకారమే తాము వెళతామన్నారు. తహసీల్దార్ లేకున్నా.. నాయబ్ తహసీల్దార్ రిజిస్ట్రేషన్లు చేస్తారని.. రిజిస్ట్రేషన్లు ఆగవన్న కేసీఆర్.. తాజా విధానం సూపర్ హిట్ అవుతుందన్నారు.

తాను తీసుకొచ్చిన కొత్త విధానం భారతదేశమంతా విప్లవం లేపుతుందన్నారు. వేరే ప్రభుత్వాల మీద విపరీతమైన ఒత్తిడి పడుతుందని.. భారతదేశ ప్రభుత్వం మీదా ఒత్తిడి వస్తుందన్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తనకు ఫోన్ చేసి కొత్త రెవెన్యూ విధానం సాధ్యమవుతుందా? అని అడిగారని.. నిజాయితీగా ఉంటే భగవంతుడు.. ప్రజలు సహకరిస్తారని.. విజయవంతం అవుతుందని తాను చెప్పినట్లు వెల్లడించారు. అందుకు తగ్గట్లే.. తానీ రోజున ధరణి వెబ్ సైట్ ను ప్రారంభించినట్లుగా పేర్కొన్నారు.