Begin typing your search above and press return to search.

ఆ నాలుగు మండలాలకు దళిత బంధు ఎందుకు..?

By:  Tupaki Desk   |   11 Sep 2021 8:31 AM GMT
ఆ నాలుగు మండలాలకు దళిత బంధు ఎందుకు..?
X
తెలంగాణ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంపై సీఎం కేసీఆర్ ఎక్కువగా ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే హుజూరాబాద్ ను ఫైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని దీనిని అమలు చేశారు. కొంత మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి యూనిట్లను పంపిణీ చేశారు. అయితే ఉప ఎన్నిక కోసమే అన్న విమర్శలు ప్రభుత్వంపై రావడంతో రాష్ట్రంలోని మరికొన్ని మండలాల్లోనూ ఈ పథకంను అమలు చేయనున్నారు. అయితే కేసీఆర్ ఇటీవల 10 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేశారు. తిరిగి రాష్ట్రానికి వచ్చిన తరువాత ప్రధానంగా ఈ పథకంపై దృష్టి సారించనున్నారు.

హుజూరాబాద్ లో ఉప ఎన్నిక నేపథ్యంలో దళితబంధు ను ప్రవేశపెట్టారని ప్రతిపక్షాలు అన్నాయి. కానీ ఈ పథకం గురించి ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, ఇప్పుడు మోక్షం కలిగిందని కేసీఆర్ సమాధానమిచ్చుకున్నారు. అయితే మరోసారి ప్రతిపక్షాల నుంచి మరోసారి ఇలాంటి విమర్శలకు తావివ్వకుండా ఉండాలని కేసీఆర్ దళిత బంధును మరో నాలుగు మండలాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మధిర అసెంబ్లీ నియోజకవర్గంలోని చింతకాని మండలం, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, అచ్చంపేట-కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ మండలం, జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలాల్లోని లబ్ధిదారులందరికీ ఈ పథకం వర్తింపజేయనున్నారు.

ఈ మేరకు సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చి సోమవారం దీనిపై సమావేశం నిర్వహించనున్నారు. అయితే రాష్ట్రానికి నాలుగు వైపుల ఉన్న నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో ఈ పథకంను అమలు చేయనున్నారు. సోమవారం ఆయా మండలాల కలెక్టర్లు, అధికారులతో కేసీఆర్ మీటింగ్ పెట్టనున్నారు. ఆ తరువాత లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి యూనిట్లను అందజేయనున్నారు. అయితే ఇప్పటికే హూజూరాబాద్ లోని లబ్ధిదారులకు వారు కోరుకున్న విధంగా కార్లు, ట్రాక్టర్లు తదితర వస్తువులను అందజేశారు. ఇక్కడ కూడా ప్రభుత్వం సూచించిన యూనిట్లలో లబ్ధిదారులు ఎంచుకున్న వాటిని అందజేయనున్నారు.

మరోవైపు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హూజూరాబాద్ ఉప ఎన్నిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బెంగాల్ మినహా ఎక్కడా ఉప ఎన్నిక నిర్వహించబోమని చెప్పింది. దీంతో ఇక్కడి ఉప ఎన్నికకు మరికొంతకాలం పట్టనుంది. అయితే దళిత బంధు పథకంను కొందరు స్వాగతిస్తున్నా.. ఇందులో అవకాశం దక్కని వారి నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే రాష్ట్రంలోని పలు మండలాల నుంచి వినతులు వస్తున్నాయి. తమ మండలాల్లో దళిత బంధు పథకం అమలు చేయాలని అక్కడి ఎమ్మెల్యేలను ఒత్తిడి చేస్తున్నారు.

మరోవైపు హుజూరాబాద్లో రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. ఓ వపు టీఆర్ఎస్, మరోవైపు బీజేపీ ప్రజలను ఆకట్టుకునేందుకు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ దళిత బంధుతో పాటు ఆకర్ష్ ను ఉపయోగించి బీజేపీ నుంచి వచ్చే నాయకులను చేర్చుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడే మకాం వేసి సమావేశాలు నిర్వహిస్తున్నారు. కులాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు. పలు నజరానాలతో వారిని ఆకర్షిస్తున్నట్లు సమాచారం. ఇక మాజీ మంత్రి, బీజేపీ లీడర్ ఈటల రాజేందదర్ ప్రభుత్వంపై విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు.

మొన్నటి వరకు కేసీఆర్ ను టార్గెట్ చేసిన ఈటల ఇప్పుడు హరీశ్ రావును లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఓ వైపు టీఆర్ఎస్లో చేరికలతో పాటు బీజేపీలోకి వలసలు సాగడం ఆశ్చర్యకరంగా మారింది. అయితే ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడకముందే ఇంతటి వేడి సంతరించుకున్న నియోజకవర్గంలో ఆ తరువాత ఎలా ఉంటుందోనని నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.