Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ తో పడిన క్రూడ్ ధరలు.. చమురు ధరలు తగ్గుతాయా మోడీ?

By:  Tupaki Desk   |   28 Jan 2020 11:30 PM GMT
కరోనా ఎఫెక్ట్ తో పడిన క్రూడ్ ధరలు.. చమురు ధరలు తగ్గుతాయా మోడీ?
X
ప్రపంచీకరణ పుణ్యమా అని ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా.. ప్రతి వ్యక్తి జీవితం మీదా అంతో ఇంతో ప్రభావం పడటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. ఇటీవల ఇరాన్ ఆర్మీ చీఫ్ ను అమెరికా దళాలు ఇరాక్ లో డ్రోన్ అణ్వస్త్రాన్ని ప్రయోగించిన హతమార్చిన వైనం.. భారత్ లోని పెట్రోల్.. డీజిల్ ధరలు పెరిగేందుకు కారణమైంది. ఇరాన్ ఆర్మీ చీఫ్ ను అమెరికా చంపటమేమిటి? భారత్ లో పెట్రోల్.. డీజిల్ ధరలు పెరగటం ఏమిటన్న క్వశ్చన్ సామాన్యులు వేయొచ్చు. కానీ.. లెక్కలు అలానే ఉంటాయి.

తమ ఆర్మీ చీఫ్ ను లేపేయటం మీద ఇరాన్ కన్నెర్ర చేయటం.. మధ్య ప్రాశ్చ్య దేశాల్లో యుద్ద మేఘాలు అలుముకోవటం.. ఆయిల్ ఉత్పత్తి మీద ప్రభావం చూపటం తో ఒక్కసారిగా క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలు వచ్చాయి. అక్కడి రాజకీయ పరిస్థితులు ఒక కొలిక్కి వస్తున్న వేళ.. అనుకోని రీతిలో చైనాలో వెలుగు చూసిన కరోనా వైరస్ ముడి చమురు ధరలు పతనమయ్యేలా చేశాయి. కరోనా వైరస్ కారణంగా చైనాలో నెలకొన్న మెడికల్ అత్యవసర పరిస్థితి.. వివిధ నగరాల్లో ఆ దేశం రవాణాను పూర్తిగా నిలిపివేయటంతో భారీ ఎత్తున ముడి చమురు డిమాండ్ పడి పోయే పరిస్థితి.

దీంతో.. డిమాండ్ తగ్గి క్రూడాయిల్ ధరలు అంతకంతకూ క్షీణిస్తున్నాయి. మంగళవారం వరుసగా ఆరో రోజు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర పడి పోయింది. ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ 59.17 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఒక దశలో 59.50 డాలర్లకు పడిపోయిన ధర ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా.. ఇది చాలా తక్కువగా చెప్పాలి.

చైనాతో రాక పోకలు సాగించొద్దని ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఇప్పటికే తమ దేశీయులకు వార్నింగ్ ఇవ్వటంతో విమాన సర్వీసులు బాగా తగ్గి పోయాయి. దీనికి తోడు చైనాలోని పన్నెండు నగరాలకు రాకపోకల్ని నిషేధించటంతో రోజువారీ ముడి చమురు వినియోగం నిలిచిపోయింది.దీనికి తోడు.. వివిధ రంగాల్లో పనులు నిలిచిపోవటం కూడా క్రూడ్ వినియోగాన్ని తగ్గిస్తోంది. కరోనా ప్రభావం చైనాతో పాటు పలు దేశాల ఆర్థిక వ్యవస్థల మీద తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు.

అంతకంతకూ తగ్గుతున్న ముడి చమురు ధరలతో దేశంలోని పెట్రోల్.. డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. ధరలు తగ్గటం మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ముడి చమురు ధరలు పెరిగినప్పుడు వెంటనే పెరిగి పోయే పెట్రోల్.. డీజిల్ ధరలు.. తగ్గిన వేళ లో మాత్రం అంతే వేగంగా తగ్గిపోవటం ఉండదు. ఇప్పటికైనా తగ్గిన ధరలకు అనుగుణంగా పెట్రోల్.. డీజిల్ ధరలు సామాన్యులకు అందుబాటులోకి వస్తే బాగుండన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.సామాన్యుల మొరను మోడీ సాబ్ ఆలకిస్తారా?